టీచర్ల సమస్యలను పరిష్కరించాలి
Published Wed, Jan 22 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన ప్రారంభించిన ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. తాత్కాలిక టీచర్లతో కలిసి కొన్ని రోజులగా ఢిల్లీ సెక్రటేరియట్ వద్ద చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తుంటే ఆమ్ ఆద్మీ సర్కార్‌గా చెప్పుకుంటున్న కేజ్రీవాల్ ప్రభుత్వం, ఆ పార్టీ కార్యకర్తలు టీచర్ల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం జంతర్‌మంతర్‌లో ఆందోళన నిర్వహించారు.
నిరసన కార్యక్రమంలో ఢిల్లీ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, కాంగ్రెస్ శాసనసభ పక్షనాయకుడు హరూన్ యూసుఫ్, మాజీ ఎమ్మెల్యే ముఖేశ్‌శర్మ, పార్టీ కార్యకర్తల తోపాటు స్థానికులు పాల్గొన్నారు.
ఆప్ సర్కార్ ధోరణి మారకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేసేందుకు వెనకాడబోమని లవ్లీ ప్రకటించారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో ధర్నాకు తరలివచ్చారు. కేజ్రీవాల్ సర్కార్ తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెడుతోందని ఇక్కడ ప్రసంగించిన పలువురు నాయకులు విమర్శించారు. సామాన్యుడి సమస్యలు పట్టని కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ ఎలా అవుతారంటూ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమను పావులా వాడుకున్నారని కేజ్రీవాల్‌పై ఆరోపణలు గుప్పించారు. రైల్‌భవన్ వద్ద ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాలో నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన ఉపాధ్యాయులతోనూ ఆప్ కార్యకర్తలు అసభ్యంగా వ్యవహరించారని ముఖేశ్‌శర్మ ఆరోపించారు.
Advertisement