బోధన.. వేదన
– అధ్యాపక పోస్టుల కేటాయింపులో అసంతృప్తి
– ప్రాధాన్యమున్న విభాగాలకు రిక్తహస్తం
– అప్రాధాన్య విభాగాలకు పోస్టుల మంజూరు
– ఆరు విభాగాలకు ఒక్కో పోస్టుతో సరి
ఎస్కేయూ : రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల్లో బోధన పోస్టులు భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి రాత పరీక్ష నిర్వహించి ఆయా వర్సిటీలు ఇంటర్వ్యూలు నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది. ఆయా వర్సిటీలకు సంబంధించి విభాగాల వారీగా ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల జాబితాను రూపొందించారు. ఇందుకు రోస్టర్ పాయింట్లు నిర్ధారించాల్సి ఉంది. శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని విభాగాల వారీగా నిర్ధారించిన బోధన పోస్టులు సమతూకం పాటించలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏళ్ల తరబడి బోధన పోస్టుల కోసం నిరీక్షించిన వారికి నిరాశ తప్పలేదు. మరో వైపు బోధన పోస్టులు కేటాయించని విభాగాల్లో సిబ్బంది కొరత యథాతథం కానుంది.
తెరపైకి ఆంధ్ర భారతి
5 విభాగాలకు ఒక్క పోస్టును కూడా కేటాయించకుండా నిరాశ కలిగించారు. బయోటెక్నాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్ ,హిందీ , సెరికల్చర్ విభాగాలకు అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టులు నిర్ధారించలేదు. రెండు దఫాలుగా భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో సెరికల్చర్ విభాగానికి మాత్రం రెండో దఫా నోటిఫికేషన్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టును కేటాయించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ , కంప్యూటర్ సైన్సెస్ , సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాలకు కేవలం ఒకే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు కేటాయించి చేతులు దులుపుకొన్నారు.
ప్రస్తుతం తెలుగు విభాగాన్ని తెలుగు తులనాత్మక సాహిత్య శాఖ అని పిలుస్తున్నారు. కానీ పోస్టులు పొందుపరిచిన జాబితాలో ఆంధ్రభారతి అనే పేరు ఉంది. దీంతో రోస్టర్ పాయింట్లు మారే ప్రమాదం లేకపోలేదు. తెలుగు తులనాత్మక అధ్యయన శాఖ అనే పేరుతో ‘ టీ’ అనే అక్షరంతో రోస్టర్ పాయింట్లు ప్రారంభం కావాల్సి ఉంది. ఆంధ్రభారతి అనే పేరును వెబ్సైట్లో ప్రకటించడంతో ‘ఏ’ అనే అక్షరాన్ని రోస్టర్ పాయింట్లు నిర్ధారించడానికి తీసుకొంటారు. ఇలాంటి చిక్కులు ఉత్పన్నమవుతున్నాయి. ఎకనామిక్స్ విభాగంలో ప్రాజెక్ట్ గడువు పూర్తీ అయినప్పటికీ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టు ఉన్నట్లు చూపడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురుకానున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.