బీజేపీ ఎంపీ మహేష్ గిరి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, ఆగ్నేయ ఢిల్లీలో రెండు పాఠశాలల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ మహేష్ గిరి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, ఆగ్నేయ ఢిల్లీలో రెండు పాఠశాలల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగర పరిధిలోని మెహ్రోలి, కృష్ణానగర్, తుగ్లకాబాద్ శాసనసభ నియోజక వర్గాలకు ఎన్నికల కమిషన్ ఇటీవల ఎన్నికల తేదీలను ప్రకటించిందని, ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళి ఈ మూడు నియోజకవర్గాల్లో అమల్లో ఉందని, అయినప్పటికీ బీజేపీ ఎంపీ మహేశ్... మద్నాపూర్ ఖాదర్ ప్రాంతంలో రెండు పాఠశాలల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారన్నారు. ఇలా చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ తగు చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ ఆందోళనా కార్యక్రమాలను చేపడుతుందని ఆయన హెచ్చరించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో శంకుస్థాపనలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. 48 గంటల్లోగా బీజేపీ ఎంపీపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.