బవానా, నరేలాలో ఏర్పాటు చేయబోతున్న డంపింగ్ ప్లాంట్‌కు సంబంధించి సమగ్ర ప్రణాళికను సమర్పించాలని
న్యూఢిల్లీ: బవానా, నరేలాలో ఏర్పాటు చేయబోతున్న డంపింగ్ ప్లాంట్‌కు సంబంధించి సమగ్ర ప్రణాళికను సమర్పించాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి(డీపీసీసీ), ఢిల్లీ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (డీఎస్‌ఐఐడీసీ)లను జాతీయ హరిత ధర్మాసనం (ఎన్‌జీటీ) ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని డీఎస్‌ఐఐడీసీ మేనేజింగ్ డైరక్టరుకు సూచించింది. పర్యావరణ అనుమతి లేకుండా ప్లాంటు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ బాలంసింగ్ రావత్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
దేశ రాజధానిలో ఇలాంటి ప్లాంటు ఇప్పటి వరకు లేకపోవడం బాధపడాల్సిన విషయమన్నారు. బవానా, నారెలాలో ఈ డంపింగ్ ప్లాంటు ఏర్పాటు కోసం ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 14 ఎకరాల భూమి అప్పగిస్తూ మార్చి 12న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుందని కార్పొరేషన్ తరఫు న్యాయవాది ఎన్‌జీటీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ విచారణకు డీఎస్‌ఐఐడీసీ తరఫున ఎవరూ హాజరుకాకపోవడంపై ట్రిబ్యునల్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు పూర్తి సమాచారంతో డీఎస్‌ఐఐడీసీ మేనేజింగ్ డైరక్టరు స్వయంగా హాజరుకావాలని చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ ఆదేశించారు. డంపింగ్ యార్డును ఏర్పాటు చేయడం వరకు మాత్రమే బాధ్యతే కాదు.. మొత్తం పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా చెత్త సేకరణ చేయడం, దానిని రవాణా చేసి నాశనం చేయడం కూడా మున్సిపాలిటీ బాధ్యతేనని బెంచ్ వ్యాఖ్యానించింది.