DSIIDC
-
సమగ్ర సమాచారమివ్వండి
న్యూఢిల్లీ: బవానా, నరేలాలో ఏర్పాటు చేయబోతున్న డంపింగ్ ప్లాంట్‌కు సంబంధించి సమగ్ర ప్రణాళికను సమర్పించాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి(డీపీసీసీ), ఢిల్లీ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (డీఎస్‌ఐఐడీసీ)లను జాతీయ హరిత ధర్మాసనం (ఎన్జీటీ) ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని డీఎస్‌ఐఐడీసీ మేనేజింగ్ డైరక్టరుకు సూచించింది. పర్యావరణ అనుమతి లేకుండా ప్లాంటు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ బాలంసింగ్ రావత్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దేశ రాజధానిలో ఇలాంటి ప్లాంటు ఇప్పటి వరకు లేకపోవడం బాధపడాల్సిన విషయమన్నారు. బవానా, నారెలాలో ఈ డంపింగ్ ప్లాంటు ఏర్పాటు కోసం ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 14 ఎకరాల భూమి అప్పగిస్తూ మార్చి 12న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుందని కార్పొరేషన్ తరఫు న్యాయవాది ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ విచారణకు డీఎస్‌ఐఐడీసీ తరఫున ఎవరూ హాజరుకాకపోవడంపై ట్రిబ్యునల్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు పూర్తి సమాచారంతో డీఎస్‌ఐఐడీసీ మేనేజింగ్ డైరక్టరు స్వయంగా హాజరుకావాలని చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ ఆదేశించారు. డంపింగ్ యార్డును ఏర్పాటు చేయడం వరకు మాత్రమే బాధ్యతే కాదు.. మొత్తం పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా చెత్త సేకరణ చేయడం, దానిని రవాణా చేసి నాశనం చేయడం కూడా మున్సిపాలిటీ బాధ్యతేనని బెంచ్ వ్యాఖ్యానించింది. -
మద్యం దుకాణాల్లోనూ ఉల్లిపాయలు
న్యూఢిల్లీ :నగరంలోని మద్యం దుకాణాల్లోనూ ఇక ఉల్లిపాయలు, ఆలుగడ్డలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. నిత్యావసర ధరలను స్థిరీకరించడం కోసం ఉల్లిపాయలు, ఆలుగడ్డలను మద్యం దుకాణాల్లో విక్రయించడానికి సంసిద్ధంగా ఉంది. ఢిల్లీ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(డీఎస్‌ఐఐడీసీ) చేసిన ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం స్పందించింది. దీనిపై ఢిల్లీవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇదే విషయమై వినయ్‌కుమార్ అనే ఓ వ్యాపారవేత్త మాట్లాడుతూ ‘నేను రోజూ బజారుకు వెళ్లే ముందు ఆలు-ఉల్లిపాయలు అవసరమా అని ఇంట్లో అడుగుతా. ఇప్పుడు మద్యం దుకాణాల్లో ఆలుగడ్డల్ని అందుబాటులో ఉంచడం సంతోషంగా ఉంది. కూరగాయల మార్కె ట్లు రద్దీగా ఉంటాయి. దీంతో ఇబ్బంది కలిగేది. ఇప్పుడు క్యూలో నిలబడాల్సి పనిలేకుండా పోయింది’ అని అన్నాడు. ఇంజినీర్ రాహుల్‌సింగ్ అనే మరో నగరవాసి మాట్లాడుతూ ‘ ఇంటికి మద్యం తెచ్చుకోవడానికి భార్య అనుమతించదు. ఈ పద్ధతి అమలు చేస్తే.. మద్యం లేదా బీరు ఎంచక్కా ఇంటికి తెచ్చుకోవచ్చు. దీని అమలు చేస్తే మంచిదే’నని అన్నాడు. న్యాయవాది ఆశిష్ మాట్లాడుతూ ‘ఢిల్లీవాసులకు మంచి రోజులు వస్తున్నాయి. మద్యం దుకాణాల్లో ఉల్లిపాయలను విక్రయించే విధానాన్ని ప్రవేశపెడితే సౌకర్యంగా ఉంటుంది. ప్రతిసారి నేనే కూరగాయలు తీసుకొస్తాను. ఇప్పుడు కూరగాయలతోపాటు మద్యం కూడా తెచ్చుకోవచ్చు’ అని అన్నాడు. సుష్మ అనే గృహిణి మాట్లాడుతూ ‘ఉల్లిపాయలు, ఆలుగడ్డలు లేకుండా కూరలు వండుకోవడం కష్టమే. ఇప్పుడు మద్యం దుకాణాల్లో కూడా లభిస్తున్నాయి. ప్రతిసారి నా భర్త మద్యం దుకాణానికి వెళ్లే అవసరం లేదు. నేను కూడా వెళ్లి ఉల్లిపాయలతోపాటు మద్యం కూడా తీసుకు రావడానికి వీలు కలిగింది. కూరగాయల కోసం మరికొంత దూర వెళ్లాల్సిన పని తప్పుతుంది’ అని పేర్కొంది.