మద్యం దుకాణాల్లోనూ ఉల్లిపాయలు
న్యూఢిల్లీ :నగరంలోని మద్యం దుకాణాల్లోనూ ఇక ఉల్లిపాయలు, ఆలుగడ్డలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. నిత్యావసర ధరలను స్థిరీకరించడం కోసం ఉల్లిపాయలు, ఆలుగడ్డలను మద్యం దుకాణాల్లో విక్రయించడానికి సంసిద్ధంగా ఉంది. ఢిల్లీ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(డీఎస్‌ఐఐడీసీ) చేసిన ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం స్పందించింది. దీనిపై ఢిల్లీవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇదే విషయమై వినయ్‌కుమార్ అనే ఓ వ్యాపారవేత్త మాట్లాడుతూ ‘నేను రోజూ బజారుకు వెళ్లే ముందు ఆలు-ఉల్లిపాయలు అవసరమా అని ఇంట్లో అడుగుతా.
ఇప్పుడు మద్యం దుకాణాల్లో ఆలుగడ్డల్ని అందుబాటులో ఉంచడం సంతోషంగా ఉంది. కూరగాయల మార్కె ట్లు రద్దీగా ఉంటాయి. దీంతో ఇబ్బంది కలిగేది. ఇప్పుడు క్యూలో నిలబడాల్సి పనిలేకుండా పోయింది’ అని అన్నాడు. ఇంజినీర్ రాహుల్‌సింగ్ అనే మరో నగరవాసి మాట్లాడుతూ ‘ ఇంటికి మద్యం తెచ్చుకోవడానికి భార్య అనుమతించదు. ఈ పద్ధతి అమలు చేస్తే.. మద్యం లేదా బీరు ఎంచక్కా ఇంటికి తెచ్చుకోవచ్చు. దీని అమలు చేస్తే మంచిదే’నని అన్నాడు. న్యాయవాది ఆశిష్ మాట్లాడుతూ ‘ఢిల్లీవాసులకు మంచి రోజులు వస్తున్నాయి.
మద్యం దుకాణాల్లో ఉల్లిపాయలను విక్రయించే విధానాన్ని ప్రవేశపెడితే సౌకర్యంగా ఉంటుంది. ప్రతిసారి నేనే కూరగాయలు తీసుకొస్తాను. ఇప్పుడు కూరగాయలతోపాటు మద్యం కూడా తెచ్చుకోవచ్చు’ అని అన్నాడు. సుష్మ అనే గృహిణి మాట్లాడుతూ ‘ఉల్లిపాయలు, ఆలుగడ్డలు లేకుండా కూరలు వండుకోవడం కష్టమే. ఇప్పుడు మద్యం దుకాణాల్లో కూడా లభిస్తున్నాయి. ప్రతిసారి నా భర్త మద్యం దుకాణానికి వెళ్లే అవసరం లేదు. నేను కూడా వెళ్లి ఉల్లిపాయలతోపాటు మద్యం కూడా తీసుకు రావడానికి వీలు కలిగింది. కూరగాయల కోసం మరికొంత దూర వెళ్లాల్సిన పని తప్పుతుంది’ అని పేర్కొంది.