న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తన సిబ్బందిలో నైతికస్థైర్యం పెంచేందుకు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) చొరవ తీసుకుంది. ఇందులోభాగంగా రెండు నెలల జీతాన్ని దీపావళి బోనస్ కింద అంద జేయడం ఇదే తొలిసారి. పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ మొత్తాన్ని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ రెండు నెలల జీతాన్ని బోనస్‌గా ఇవ్వడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. తమ పార్టీ 15 సంవత్సరాలపాటు అధికారంలో ఉందన్నారు.
యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఢిల్లీకి చెందిన ముగ్గురు నాయకులు మంత్రులుగా పనిచేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అయితే ఏనాడూ బోనస్ ఇవ్వలేదన్నారు. దీపావళి బోనస్ ఇవ్వాలని ఈసారి మాత్రమే నిర్ణయించామన్నారు. తమ పార్టీ కార్యకర్తలతోపాటు ఉద్యోగులు కూడా ఎన్నికలకు అన్నివిధాలుగా సన్నద్ధమవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో బోనస్ అందజేయడం వల్ల వారిలో ఉత్సాహం ద్విగుణీకృతమవుతుందన్నారు. శాసనసభను తక్ష ణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా ఎన్నికలు జరిపించాలన్నారు. ఈ ఎన్నికల్లో తమ విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు డీపీసీసీ దీపావళి బోనస్
Published Wed, Oct 22 2014 10:59 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement