న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలను గడగడలాడిస్తున్న హుదూద్ తుఫాన్ నగర వాయునాణ్యతపై ప్రభావం చూపుతోంది. ఆదివారం ఇది మరింత ప్రభావం చూపనుంది. భారత వాతావరణ శాఖ అనుబంధ సిస్టం ఫర్ ఎయిర్ క్వాలిటీ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫర్) అందించిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం నాటికే నగరవాతావరణంలో కార్బన్ మోనాక్సై డ్, ధూళికణాల శాతం పెరిగింది. ఒకవేళ ఆదివారం కనుక వర్షం కురవకపోతే వాయునాణ్యత తీవ్రంగా దెబ్బతింటుందని, అందుకు నగరవాసులు అన్నివిధాలుగా సిద్ధం కావాలని సఫర్ హెచ్చరించింది.
నిర్ధారించిన డీపీసీసీ
హుదూద్ తుఫాన్ ప్రభావం కారణంగా నగర వాతావరణంలో కొన్ని కాలుష్య కారకాల పరిమాణం పెరుగుతోందనే విషయాన్ని ఢిల్లీ కాలుష్య నియంత్రణ సంస్థ (డీపీసీసీ)కి చెందిన శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు. ఆదివారం నాటికి కార్బన్ మోనాక్సైడ్ స్థాయి దాదాపు రెండింతలయ్యే అవకాశాలు ఉన్నట్టు సఫర్ చెబుతోంది. ఊపిరితిత్తులు సరిగా పనిచేయని కారణంగా శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదురు కావచ్చని చెబుతోంది. ఓజోన్ స్థాయి ప్రస్తుతం బిలియన్‌కు 40 కణాలుగా ఉండగా అది ఆదివారం నాటికి 63కు చేరుకోవచ్చని తెలిపింది.
తక్షణ మే ప్రభావం చూపుతుంది: శాస్త్రవేత్త
కోస్తా తీరం నుంచి గాలిలోకి పెద్దఎత్తున వచ్చే కాలుష్య కారకాలు నేరుగా గంగాతీరం వద్ద పడతాయని సఫర్‌కు చెందిన ప్రధాన శాస్త్రవేత్త గుర్ఫాన్ బేగ్ తెలిపారు. ఈ పరిణామం నగరంపై ప్రభావం చూపుతుందన్నారు. రెండురోజుల పాటు వాయు నాణ్యత బాగా తగ్గిపోతుందన్నారు. ఒకవేళ వర్షం కురిస్తే కనుక పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంటుందని, అయినప్పటికీ కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్‌ల స్థాయి బాగా పెరుగుతుందని అన్నారు. ఆదివారం నగరంలో బలమైన గాలులు వీచే అవకాశముందన్నారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడొచ్చన్నారు. దీని ప్రభావం ఉత్తరప్రదేశ్‌పైనా పడుతుం దన్నారు. ఇదిలాఉండగా దీపావళి సమీపిస్తుండడంతో కాలుష్య నియంత్రణకు సంబంధించి డీపీసీసీ నగరంలోని పలు ప్రాంతాల్లో అవగాహనా శిబిరాలను నిర్వహిస్తోంది.
నగర వాయు నాణ్యతపై‘హుదూద్’ ప్రభావం పెరిగిన కాలుష్యం
Published Sat, Oct 11 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM
Advertisement