సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కాలుష్యం కలిగిస్తోన్న అన్ని పరిశ్రమలు మూసివేసేలా చూడాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ(డీపీసీసీ)ని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మంగళవారం ఆదేశించారు. మొదట కాలుష్య విభాగాలకు నోటీసులు జారీ చేయాలన్నారు. డీపీసీసీ ఆదేశాలను పాటిం చని ఇన్‌స్పెక్టర్‌లపై చర్యలు తీసుకోవాలని పట్టణ అభివృద్ధి కార్యదర్శికి సూచించారు. సంబంధిత కమిషనర్లందరూ డీపీసీసీ ఉత్తర్వులు పాటించాలని ఆదేశించారు. విషపదార్థాలను శుద్ధి చేయకుండానే యమునా నదిలోకి వదిలినందుకు డీపీసీసీ ఇటీవల 112 పరిశ్రమలకు నోటీసులు జారీ చేసింది.
ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు..
నగరంలో కాలుష్య స్థాయిలను నియంత్రించేం దుకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మంగళవారం ఉన్నత స్థాయి కమిటీ నియమించారు. ఎల్‌జీ ఆదేశాల ప్రకారం ఈ కమిటీ రెండు అంశాలపై దృష్ట్టి సారిస్తుంది. ఢిల్లీ రోడ్లపై పెరుగుతోన్న వాహనాల కారణంగా కలుగుతోన్న కాలుష్యంతో పాటు పారిశ్రామిక వ్యర్థాలను, సీవేజ్‌ని వదలడం వల్ల యమునా నదిలో కాలుష్య స్థాయిలను లెక్కకట్టనుంది. నగరంలో కాలుష్యానికి సంబంధించిన అన్ని అంశాలను, అందుకు గల కారణాలు, దాని స్థాయిలు, కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యల ను పరిశీలించాలని నజీబ్ జంగ్ ఈ కమిటీకి సూచించారు. కాలుష్య సమస్య పరిష్కారానికి స్వల్ప కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక పరిష్కారాలను సూచించాలని ఆదేశించారు. నగరంలో కాలు ష్య నియంత్రణకు చర్యలు చేపట్టడం కోసం అమలుకు వీలున్న పరిష్కారాలతో సమగ్ర నివేదికను రూపొందించి నాలుగువారాలలో సమర్పిం చాలని ఆయన కమిటీని ఆదేశించారు. ప్రధాన కార్యదర్శి నేతత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో ట్రాఫిక్ పోలీస్ కమిషనర్, పర్యావరణ శాఖ కార్యదర్శి. రవాణా విభాగం కమిషనర్ సభ్యులుగా ఉన్నారు.
మల్టీమోడల్ రవాణా వ్యవస్థను సమీక్షించిన ఎల్జీ
మెట్రోస్టేషన్ల పరిసరాల్లో ఢిల్లీ సమీకృత బహుళ రవాణా వ్యవస్థ (డిమ్టస్) మార్గాల నిర్మాణం కోసం యూనిఫైడ్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ -ప్లానింగ్, ఇంజనీరింగ్ (యూటీటీటీఐపీఈసీ) సమర్పించిన ప్రజెంటేషన్‌ను లెప్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్ జంగ్ మంగళవారం పరిశీలించారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండే మెట్రో స్టేషన్ల పరిసరాల్లో పాదచారులు, వాహనాల ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఉపయోగించే విధానాలతో యూటీటీటీఐపీఈసీ ఈ ప్రజెంటేషన్ సమర్పించింది. ఇలాంటి నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు కావాల్సి ఉన్న 44 మెట్రో స్టేషన్లను యూటీటీటీఐపీఈసీ ఇప్పటికే గుర్తించింది. వీటిలో తొమ్మిది మెట్రో స్టేషన్ల కోసం సమగ్ర ప్రణాళికలను కూడా రూపొందించింది. మొదటి రెండు దశల్లో నిర్మించిన మెట్రో స్టేషన్లతో పని ప్రారంభించిన యూటీటీటీఐపీఈసీ మూడు నాలుగోదశ మెట్రో స్టేషన్లలో కూడా పనులు ప్రారంభించాలనుకుంటోంది. ప్రాజెక్టుల నిర్మాణదశలోనే వాటి పరిసరా ల్లో ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిం చాలని ఈ సంస్థ భావిస్తోంది.
లక్ష్మీనగర్, నిర్మాణ్‌విహార్, ప్రీత్ విహార్, కార్కర్‌డూమా, ఛత్తర్‌పూర్ మెట్రో స్టేషన్ల సమీపంలో పనులు చేపట్టవలసిందిగా ఎల్జీ ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌ను (డీఎంఆర్సీ) ఆదేశించారు. ఐఎన్‌ఏ, ఎయిమ్స్, గ్రీన్‌పార్క్, హౌజ్‌ఖాజ్ మెట్రో స్టేషన్ల పనులు ప్రజాపనులశాఖ (పీడబ్ల్యూడీ)కు అప్పగిం చారు. ఈ మెట్రో స్టేషన్లకు సంబంధించిన పనులను తక్షణం చేపట్టి నిర్ణీత కాలంలో పూర్తిచేయాలని ఎల్జీ ఆదేశించారు. మిగతా 35 మెట్రోస్టేషన్ల ప్రణాళికలను కూడా త్వరలో పూర్తిలో పూర్తిచేయాలని నజీబ్ జంగ్ యూటీటీటీఐపీఈసీని ఆదేశించారు. ఈ ప్రణాళికల అమలులో జరుగుతున్న జాప్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మెట్రో స్టేషన్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో రద్దీని తగ్గించడానికి ప్రారంభించిన ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయడానికి సంబంధిత విభాగాలన్నీ సహకరించాలని నజీబ్‌జంగ్ కోరారు.
కాలుష్య పరిశ్రమలపై కఠినంగా వ్యవహరించండి
Published Tue, May 13 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM
Advertisement
Advertisement