అప్రకటిత కోతలను ఉపేక్షించం
Published Thu, Jan 9 2014 11:05 PM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
సాక్షి, న్యూఢిల్లీ: అప్రకటిత కోతలు విధించే విద్యుత్ సరఫరా కంపెనీలను నిలదీస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హెచ్చరించారు. గత నెలన్నర రోజులుగా కోతలకు సంబంధించిన డేటాను ఇవ్వాల్సిందిగా కంపెనీలను కోరామని, అప్రకటితంగా కోతలు విధించిన కంపెనీలు సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుందని గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెప్పారు. నగరంలోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్తు కోతలు పెరిగిపోయాయని, నగరంలో విద్యుత్తు సరఫరాను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనట్లయితే నగరమంతటా ఆందోళనలు నిర్వహిస్తామని ెహ చ్చరిస్తూ డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ రాసిన లేఖకు కేజ్రీవాల్ గురువారం విలేకరుల సమావేశంలో ప్రతిస్పందించారు. ఏయే ప్రాంతంలో ఎప్పటి నుంచి ఎప్పటివరకు విద్యుత్ కోత విధిస్తారో తెలిపే సమాచారాన్ని విద్యుత్తు కంపెనీలు వెబ్‌సైట్‌లో ఉంచాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం కాకుండా అప్రకటితంగా విధించే విద్యుత్తు కోతల గురించి ఫిర్యాదు చేయడం కోసం ఒక టెలిఫోన్ నంబర్‌ను జారీచేయనున్నట్లు ఆయన చెప్పారు. షెడ్యూలు ప్రకారం విధించే కోతలు కాకుండా, అప్రకటితంగా కోతలు విధించినట్లయితే కంపెనీలను సంజాయిషీ కోరతామన్నారు. వెబ్‌సైట్ డిస్కంలు ఆడిట్‌కు ఇష్టపడడం లేదని, అందువల్ల తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలుచేయడం కోసం విద్యుత్ కంపెనీలు అడ్డగోలుగా కోతలు విధించవచ్చని తమకు ఇదివరకే కొందరు హెచ్చరించారని ఆయన చెప్పారు. విద్యుత్తు కంపెనీల అడ్డగోలు వ్యవహారాలను తాము ఉపేక్షించేదిలేదన్నారు. నీటి సరఫరా జరగని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ట్యాంకర్ డ్రైవర్ల ఫోన్‌నంబర్లను వెబ్‌సైట్‌లో ఉంచనున్నామన్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లును జనవరి ఆఖరు వరకు రూపొందించనున్నట్లు చెప్పారు.
Advertisement
Advertisement