ఢిల్లీపై ఆప్‌ జెండా  | Arvind Kejriwal AAP Ends BJPs 15 Year Rule In Delhi MCD | Sakshi
Sakshi News home page

ఢిల్లీపై ఆప్‌ జెండా 

Published Thu, Dec 8 2022 4:18 AM | Last Updated on Thu, Dec 8 2022 4:18 AM

Arvind Kejriwal AAP Ends BJPs 15 Year Rule In Delhi MCD - Sakshi

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ దుమ్ము రేపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయంతో రాజకీయ అరంగేట్రం చేసిన ఆ పార్టీ తొలిసారిగా ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్లోనూ (ఎంసీడీ) పాగా వేసింది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర దించుతూ ఎంసీడీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. కమలం పార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించి రాణించినా విజయానికి దూరంలో 20 స్థానాల దూరంలో ఆగిపోయింది.

మొత్తం 250 వార్డుల్లో మెజారిటీకి 126 సీట్లు కావాల్సి ఉండగా ఆప్‌ 134 దక్కించుకుంది. బీజేపీ 104 చోట్ల గెలిచింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయాల పరంపరను కొనసాగిస్తూ కేవలం 9 వార్డులకు పరిమితమైంది. స్వతంత్రులు మూడు స్థానాల్లో నెగ్గారు. ఏ ఎన్నికల్లోనైనా బీజేపీని ఓడించడం ఆప్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం! ఆప్‌ తొలిసారిగా 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, తాజాగా పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గినప్పుడు రెండు చోట్లా అధికారంలో ఉన్నది కాంగ్రెసే.

2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ తిరుగులేని విజయంతో అధికారాన్ని నిలబెట్టుకుంది. ఢిల్లీపై ఏడేళ్ల ఆప్‌ పట్టును బలహీనపరచాలన్న బీజేపీ ప్రయత్నాలకు ఈ ఫలితాలు ఎదురుదెబ్బేనని భావిస్తున్నారు. ఆప్‌ విజయంతో ఆ పార్టీ కార్యకర్తలు మద్దతుదారుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. బాజాలు మోగిస్తూ, ప్రధాన కార్యాలయంతో పాటు నగరమంతటా మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు.

‘ఎంసీడీలోనూ కేజ్రీవాల్‌ పాలన. వచ్చే ఐదేళ్లూ మంచి రోజులే’ అంటూ ఢిల్లీ అంతటా హోర్డింగులు వెలిశాయి. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని ఆప్‌ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. కార్పొరేషన్‌ను అవినీతి, లంచాల జాడ్యం నుంచి విముక్తం చేసి దేశ రాజధానిలో సదుపాయాలు, సౌకర్యాలను పూర్తిస్థాయిలో మెరుగు పరుస్తామని ప్రకటించారు.

అందుకు కేంద్రం, ప్రధాని మోదీ ఆశీస్సులు కోరారు! ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్‌ గుప్తా మాట్లాడుతూ, 15 ఏళ్ల పాలన నేపథ్యంలో సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో తాము మెరుగైన ఫలితాలే సాధించామన్నారు. ఓట్ల శాతాన్ని యథాతథంగా నిలుపుకోవడం తమ విజయమేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా అభిప్రాయపడ్డారు. 

తొలుత బీజేపీదే హవా... 
ఢిల్లీలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లను విలీనం చేస్తూ ఈ ఏడాది మొదట్లో 250 వార్డులతో ఎంసీడీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జరిగిన తొలి ఎన్నికలివి. డిసెంబర్‌ 4న పోలింగ్‌ జరిగింది. బుధవారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైంది. తొలుత ఆప్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా సాగినా క్రమంగా కమలం పార్టీ దూసుకెళ్లింది. మధ్యాహ్నానికల్లా ఆప్‌ 95, బీజేపీ 107 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచాయి. తర్వాత క్రమంగా ఆప్‌ స్థిరంగా పుంజుకుని మెజారిటీ మార్కును దాటేసింది. 2017లో జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో 272 వార్డుల్లో బీజేపీ ఏకంగా 181 స్థానాలు గెలిచింది. ఆప్‌ 48, కాంగ్రెస్‌ 30 స్థానాలకు పరిమితమయ్యాయి. 

బీజేపీకి పెరిగిన ఓట్ల శాతం 
ఎంసీడీ ఎన్నికల్లో ఆప్‌కు 42 శాతం ఓట్లు రాగా బీజేపీ 2017తో (36) పోలిస్తే 3 శాతం ఎక్కువగా 39.1 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌కు 11.7 శాతంతో సరిపెట్టుకుంది. 2017లో ఆప్, కాంగ్రెస్‌ చెరో 21 శాతం ఓట్లు సాధించాయి. అంతేకాదు, 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కూడా బీజేపీ ఓట్ల శాతం పెరగ్గా ఆప్‌కు మాత్రం తగ్గడం మరో విశేషం! ఆ ఎన్నికల్లో ఆప్‌ 54 శాతం ఓట్లతో మొత్తం 70 సీట్లకు గాను ఏకంగా 62 చోట్ల గెలిచింది. బీజేపీ 38.5 శాతం ఓట్లతో మిగతా 8 సీట్లు దక్కించుకుంది. 

అందరి దృష్టీ మేయర్‌ ఎన్నికపైనే! 
ఎంసీడీ ఎన్నికల్లో గెలిచినా మేయర్‌ ఎన్నిక విషయంలో ఆప్‌కు బీజేపీ పెద్ద ట్విస్టిచ్చే ఆస్కారం లేకపోలేదు. కేంద్రం చెప్పుచేతల్లో ఉండే ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు 12 మంది కౌన్సిలర్లను నియమించే అధికారముంది. ఆయన గనక 12 మందీ బీజేపీ వాళ్లనే నియమిస్తారనుకుంటే మేయర్‌ ఎన్నిక రసకందాయంలో పడ్డట్టే. వారు మేయర్‌ ఎన్నికలో భాగస్వాములు అవుతారా, లేదా అన్నదానిపై ప్రస్తుతానికైతే స్పష్టత లేదు. ఒకవేళ వారు పాల్గొనే పక్షంలో ఆప్‌ మెజారిటీ బాగా తగ్గిపోతుంది.

ప్రస్తుతం బీజేపీకి 104 మంది కౌన్సిలర్లున్నారు. 12 నామినేటెడ్‌ సభ్యులతో కలిపి వారి సంఖ్య 116కు పెరుగుతుంది. అప్పుడు కూడా ఆప్‌కున్న 134 మంది సభ్యులు మేయర్‌ను ఎన్నుకునేందుకు సరిపోతారు. కాకపోతే ఇక్కడా మరో ట్విస్టుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా మేయర్‌ ఎన్నికకు ఫిరాయింపుల చట్టం వర్తించదు. పార్టీలు విప్‌ జారీ చేయడానికి కూడా వీల్లేదు.

కాంగ్రెస్‌కు 9 మంది కౌన్సిలర్లన్నారు. మరో ముగ్గురు స్వతంత్రులు గెలుపొందారు. వీరితో పాటు ఆప్‌ నుంచి ఎంతో కొంతమంది గనక బీజేపీ బేరసారాలకు లొంగే పక్షంలో మేయర్‌ ఎన్నిక హోరాహోరీగా జరగడం ఖాయమని భావిస్తున్నారు.  చట్టం ప్రకారం ఢిల్లీ మేయర్‌ను ఏటా ఒకసారి చొప్పున ఐదేళ్లలో ఐదుసార్లు ఎన్నుకోవాల్సి ఉంటుంది. తొలి ఏడాది మహిళకు, మూడో ఏడాది ఎస్సీకి అవకాశమివ్వాలి. 

అప్పుడే మాటల యుద్ధం 
ఢిల్లీ మేయర్‌ ఎన్నిక విషయమై బీజేపీ, ఆప్‌ అప్పుడే మాటల యుద్ధానికి దిగాయి. మేయర్‌ ఎన్నిక ఇప్పటికైతే ‘ఓపెన్‌ గేమే’నంటూ బీజేపీ ఐటీ విభాగం హెడ్‌ అమిత్‌ మాలవీయ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తమ కౌన్సిలర్లను లాక్కునేందుకు బీజేపీ అప్పుడే మైండ్‌ గేమ్‌కు తెర తీసిందని సిసోడియా ఆరోపించారు.   

సిసోడియా, జైన్‌ ఇలాకాల్లో ఓటమి
ఎంసీడీపై ఆప్‌ జెండా ఎగిరినా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన ఆ పార్టీ మంత్రుల ఇలాకాల్లో పరాజయమే ఎదురైంది. ఎక్సైజ్‌ పాలసీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న మనీశ్‌ సిసోడియా అసెంబ్లీ నియోజకవర్గమైన పత్పర్‌గంజ్‌ పరిధిలోని నాలుగు వార్డులకు గాను ఏకంగా మూడింట్లో ఆప్‌ పరాజయం పాలైంది! అవినీతి ఆరోపణలకు సంబంధించి ఈడీ కేసులో మూణ్నెల్లకు పైగా జైల్లో గడుపుతున్న ఢిల్లీ మరో మంత్రి సత్యేంద్ర జైన్‌ నియోజకవర్గం శకుర్‌ బస్తీ పరిధిలోని మూడు వార్డులూ ఆప్‌ చేజారాయి. 

మోదీ ఆశీస్సులు కావాలి 
దేశ రాజధానిలో సదుపాయాలు, సౌకర్యాలను పూర్తిస్థాయిలో మెరుగుపరుస్తాం. అందుకు కేంద్రం, ప్రధాని మోదీ ఆశీస్సులు కావాలి.    
– కేజ్రీవాల్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement