డిస్కమ్‌లు సరిగ్గా పనిచేయడం లేదు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: నగరంలో విద్యుత్ సరఫరాకు బాధ్యత వహిస్తున్న డిస్కమ్‌లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. నగరంలో విద్యుత్ సంక్షోభానికి డిస్కంలను బాధ్యులను చేసేందుకు కేంద్రం వెనుకాడుతోందని ఆయన విమర్శించారు. కేంద్రం ధోరణి చూస్తుంటే డిస్కంలతో కుమ్మక్కైనట్టు తెలుస్తోందని ఆరోపించారు. నగరవాసులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని డిస్కంలు ఢిల్లీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయని, దానికి అవి కట్టుబడి ఉండేలా చూడాలని కేజ్రీవాల్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గత నెల 30న నగరంలో సంభవించిన పెనుదుమారం కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నదని, దీంతో పరిస్థితి మరింత విషమించిందని పేర్కొన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ ప్రధాని అప్పాయింట్‌మెంట్ కోరుతూ ఒక లేఖ రాశారు.
విద్యుత్ సబ్సిడీ కొనసాగించాలి విద్యుత్ బిల్లులపై తమ ప్రభుత్వం ప్రారంభిం చిన సబ్సిడీలను కొనసాగించాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రధానికి రాసిన లేఖలో కోరారు. గత కొన్ని రోజులుగా నగరంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై చర్చించేందుకు తనకు పది నిమిషాల సమయం కేటాయించాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విద్యుత్ కంపెనీలు తనను బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నించాయని, అయితే వాటి లెసైన్సులు రద్దు చేస్తానని హెచ్చరించడంతో దారికి వచ్చాయని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం కేంద్ర పాలన కొనసాగుతున్నందున విద్యుత్ కంపెనీల పట్ల కఠినంగా వ్యవహరించాలని కేజ్రీవాల్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో రోజుకు 24 గంటలు విద్యుత్ సరఫరా జరిగేలా చూశామని, కానీ గత కొద్ది రోజులుగా నగరవాసులు నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. తాము ప్రారంభించిన విద్యుత సబ్సిడీ మార్చి 31వరకు అమలైందని, ఆ తరువాత విద్యుత్ టారిఫ్ రెండింతలు పెరిగిందని పేర్కొన్నారు. విద్యుత్ చార్జీల నుంచి ఉపశమనం కలిగించేందుకు యూపీఏ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆరోపించారు.