నిజమేంటో త్వరలోనే తెలుస్తుంది: సీఎం కేజ్రీవాల్
Published Sat, Feb 1 2014 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
సాక్షి, న్యూఢిల్లీ: కరెంటు కొనుగోలుకు నిధులు లే నందున కోతలు విధిస్తామంటూ డిస్కమ్‌లు చేసిన ప్రకటనపై మండిపడ్డ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాగ్ నివేదిక వచ్చాకే అన్ని నిజాలూ వెల్లడవుతాయన్నారు. ‘మా దగ్గర నిధులు లేవని డిస్కమ్‌లు అంటున్నాయి. మరి డబ్బంతా ఏమైనట్టు ? ఆ నిధులన్నీ ఏమయ్యాయో కాగ్ తెలుసుకుంటోంది. డిస్కమ్‌లు నిజంగానే ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నదీ లేనిదీ నివేదిక వచ్చాకే తేలుతుంది’ అని ఆయన విలేకరులతో అన్నారు. రోజుకు 8-10 గంటలపాటు కోతలు విధిస్తామంటూ ప్రకటనలు చేసిన డిస్కమ్‌లపై చర్యలు తీసుకుంటారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ కాగ్ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘విద్యుత్ కోతలు విధిస్తామంటూ ప్రజలను బెదిరించడాన్ని కరెంటు పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మానుకోవాలని,
మున్ముందు కూడా ఇలాగే చేస్తే వాటి లెసైన్సులు రద్దు చేస్తాం. విద్యుత్ కోతలు ఉండవు. కోతలు విధిస్తారన్న బెదిరింపులు ఉత్తుత్తివే! ఇలాంటి బెదిరింపులతో డిస్కమ్‌లు ప్రజలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక మీదట కూడా ఇలాగే చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని కేజ్రీవాల్ శుక్రవారం హెచ్చరించారు. డిస్కమ్‌లు కాగ్ ఆడిట్‌కు సహకరించడం లేదని ముఖ్యమంత్రి ఆరోపించారు. అవి తమ ఖాతాలను ఆడిట్ సంస్థలకు చూపించడం లేదని, దీనిని బట్టి చూస్తుంటే డిస్కమ్‌ల ఖాతాల్లో అవకతవకలు ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. డిస్కమ్‌ల వ్యవహార శైలి ఇలాగే ఉంటే వాటి లెసైన్సులను రద్దు చేసి, ఇతర కంపెనీలను తీసుకువస్తామని కేజ్రీవాల్ హెచ్చరించారు. మనదేశంలో టాటా, అంబానీలేగాక మరెన్నో కంపెనీలు ఉన్నాయని స్పష్టం చేశారు.
Advertisement
Advertisement