ఓటమికి భయపడేది లేదు
Published Sat, Mar 1 2014 11:16 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: ‘ఒకటి రెండు సార్లు ఓడిపోయినంత మాత్రాన మేం యుద్ధభూమిని వదిలి పారిపోయే రకం కాదు.. వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాం..’ అని ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ వ్యాఖ్యానించారు. 15 ఏళ్లుగా ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీ గత విధాన సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాగా, గాయాలను పట్టించుకోబోమని లవ్లీ అన్నారు. పార్టీ పునరుత్థానికి ప్రణాళిక రచించామన్నారు. ఒకటి, రెండుసార్లు ఓడిపోయినంతమాత్రాన డీలా పడాల్సిన పనిలేదన్నారు. తమ ప్రత్యర్థులైన భారతీయ జనతాపార్టీ(బీజేపీ), ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్) లు మంచి పరిపాలన అందించలేవని రుజువైపోయిందన్నారు. 49 రోజుల పాలనకే ఆప్ ఢిల్లీ ప్రభుత్వం పగ్గాలను వది లేసి పారిపోయిందని విమర్శించారు. బీజేపీ సైతం నగరంలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో విఫలమైందని ఆరోపించారు. వరుసగా మూడు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత గత విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి విదితమే.
ఈ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఎనిమిదింటిని మాత్రమే ఆ పార్టీ గెలుచుకోగలిగింది. ఇటువంటి క్లిష్ట సమయంలో పార్టీని బలోపేతం చేయడానికి అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్న లవ్లీ మీడియాతో మాట్లాడుతూ తాము మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘గతంలో అయిన గాయం నుంచి పార్టీ త్వరగానే కోలుకుంటోంది. మేం వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని 7 నియోజకవర్గాల్లో విస్తృతం గా పర్యటించి కాంగ్రెస్ పార్టీ గతంలో సాధిం చిన విజయాలను వివరిస్తాం. గత ఎన్నికల్లో అనూ హ్య విజయం సాధించిన తన 49 రోజుల పాలన, మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీపాలనలోని లోటుపాట్లు, వైఫల్యాలను ఎండగడతామని వివరించా రు. నగరంలోని ఏడు లోక్‌సభ సీట్లూ తమవేనని బీజేపీ, ఆప్ ప్రకటించుకుంటున్న తీరుపై ఆయన స్పందిస్తూ..‘ అలా ప్రచారం చేసుకోవడం వాటి అజ్ఞానానికి నిదర్శనం. మోడీ, కేజ్రీవాల్ ఇద్దరూ మీడియా సృష్టించినవారే.. వారి ప్రభావం ఈ ఎన్నికల్లో ఎంతమాత్రం ఉండదు. మీడియా మాత్రం గోరింతలను కొండింతలు చేసి చూపిస్తోంద’న్నారు.
‘మేం బయటనుంచి మద్దతు ఇచ్చినా సర్కారును నడపడంలో ఆప్ విఫలమైంది. మళ్లీ వారికి అధికారం ఇచ్చినా ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేరు..’ అని విమర్శించారు. బీజేపీ పరిస్థితి కూడా దీనికి భిన్నం కాదని ఆయన విశ్లేషించారు. ‘ఆప్ హామీలు చూసి గత ఎన్నికల్లో ప్రజలు వారికి అవకాశమిచ్చా రు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మాపై కూడా ఉంది కాబట్టే ఆ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు బయటనుంచి మద్దతు ఇచ్చి ప్రోత్సహించాం. అయితే ఈ అవకాశాన్ని ఆప్ వినియోగించుకోలేకపోయింది. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడం మొదలుపెట్టింది. జన్‌లోక్‌పాల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనేలేకపోయింది. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన ఒక ప్రభుత్వం తన ఇష్టానుసారం నడుచుకుంటానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు కదా..’ అని అన్నారు. ‘కేజ్రీవాల్ ఒక అబద్ధాలకోరు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజల రిఫరెం డం అడిగిన వ్యక్తి ప్రభుత్వాన్ని వీడినప్పుడు మరి ఆ ప్రజల తీర్పును ఎందుకు అడగలేదు..?’ అని లవ్లీ సింగ్ ప్రశ్నించారు. వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తులా కృషిచేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Advertisement
Advertisement