కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ నివాసం ముందు ఆందోళనకు దిగిన 60 మంది కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ నివాసం ముందు ఆందోళనకు దిగిన 60 మంది కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పెంచిన రైల్వే చార్జీలను వెంటనే తగ్గించాలని, రైల్వేలో ప్రైవేటీకరణకు దారులు తెరవొద్దని డిమాండ్ చేస్తూ డీపీసీసీ అధ్యక్షుడు అర్వీందర్‌సింగ్ లవ్లీ నేతృత్వంలో మంగళవారం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. త్యాగరాజ్ మార్గ్‌లోని గౌడ నివాసం ముందు చేపట్టిన ఈ ఆందోళనకు ఎటువంటి అనుమతి లేదని కమిషనర్ జతిన్ నర్వాల్ తెలిపారు. లవ్లీతోపాటు పార్టీ నేత ముఖేశ్ శర్మ తదితర 60 మంది నేతలపై కేసులు నమోదు చేశామని, చత్తర్‌సింగ్ అనే కార్యకర్తను కూడా అరెస్టు చేశామన్నారు.
ప్రజాసేవకుల పట్ల అవిధేయతగా వ్యవహరించినందుకాగాను భారత శిక్షాస్మృతి, సెక్షన్ 188, విధులను అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు 341, విధుల నుంచి వైదొలిగేలా ఒత్తిడి తెచ్చినందుకు 353 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఆందోళన అరగంటపాటు కొనసాగిందని, ఆ వెంటనే నలుగురిని అరెస్టు చేసి, విడుదల చేశామని చెప్పారు.మంగళవారం జరిగిన ఈ ఆందోళన సమయంలో కొందరు కార్యకర్తలు గౌడ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రి ఇంటి వద్ద ఉన్న నేమ్ ప్లేట్‌ను తొలగించి, కిందపడేసి కాళ్లతో తొక్కారు. ఈ దృశ్యాలను మీడియా పదే పదే ప్రసారం చేసింది. ఎట్టకేలకు పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.