బాధ్యత ఎన్డీయేదే: కాంగ్రెస్
న్యూఢిల్లీ: నగరంలో విద్యుత్ సంక్షోభానికి షీలా ప్రభుత్వమే కారణమంటూ కేంద్రమంత్రి పీయుష్ విమర్శించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. ఢిల్లీ.. కేంద్ర ప్రభుత్వ పాలన కింద ఉన్నందువల్ల ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఎన్డీయేదేనని డీపీసీసీ అధ్యక్షుడు అర్వింద్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. షీలా ప్రభుత్వం నగరవాసులకు 24 గంటలపాటు విద్యుత్‌ను సరఫరా చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. పీయుష్ తన బాధ్యతలనుంచి ఎంతమాత్రం తప్పించుకోలేరన్నారు. తమ ప్రభుత్వం విద్యుత్ రంగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించిందన్నారు. ఆ రంగంలో సంస్కరణలు కూడా తెచ్చామన్నారు. సమస్యను పరిష్కరించే సంగతిని గాలికొదిలేసి కేంద్ర మంత్రి ఎదురుదాడికి దిగుతున్నాడని విమర్శించారు.
‘ఆప్’ చేసిందేమీ లేదు..
నగరం విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆప్ ప్రభుత్వం కూడా ఒక కారణమన్నారు. వేసవి ప్రణాళికను ఎందుకు రూపొందించలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ సమస్యను పరిష్కరించగలిగామని, అయితే ఆప్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు.
బాధ్యతారాహిత్యం: కేజ్రీవాల్
విద్యుత్ సంక్షోభం విషయంలో బీజేపీ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సమస్యను పరిష్కరించలేకపోతోందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతోందని, ఎన్నికలకు అనుమతించడం లేదని అన్నారు.