nursery admission
-
నర్సరీ అడ్మిషన్ల విచారణ 28న: సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని పాఠశాలల్లో నర్సరీ అడ్మిషన్ల వివాదంపై సత్వరమే విచారణ జరిపేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి పి. సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 28 నాటికి ఈ కేసు విచారణను వాయిదా వేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని, డ్రా ద్వారా ఎంపికైన విద్యార్థులు చేరవచ్చన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేస్తూ... న్యాయమూర్తులు హెచ్.ఎల్. దత్తు, ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం, ఢిల్లీ పాఠశాలల్లో నర్సరీ అడ్మిషన్లను నిలిపివేయాలని మరోసారి ఆదేశించింది. పెద్ద ఎత్తున దుర్వినియోగమవుతుందోంటూ ఢిల్లీ ప్రభుత్వం అడ్మిషన్ల సమయంలో ఇంటర్‌స్టేట్ ట్రాన్స్ఫర్ (ఐఎస్టీ) కేటగిరీని తొలగించడంపై వివిధ రాష్ట్రాలనుంచి దేశరాజధానికి వచ్చిన తల్లిదండ్రులు చేసిన అప్పీలు మేరకు కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. ఫిబ్రవరి 27న ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల డ్రా ద్వారా తమ పిల్లలకు కేటాయించిన సీట్లు రద్దయ్యాయని ఐఎస్టీ తల్లిదండ్రులు తమ అభ్యర్థనలో పేర్కొన్నారు. గతంలో ఐఎస్టీ కేటగిరీకి 75 పాయింట్లుండేవి. ఏప్రిల్ 3 నాటి ఆదేశానుసారం గత ఏడాది డిసెంబర్ 18న విడుదలైన నోటిఫికేషన్లో 60శాతం సీట్లకు కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని బాధితులు తెలిపారు. ఇటీవలి పాయింట్ సిస్టమ్ ద్వారా... 100 పాయింట్లలో చుట్టపక్కల నివసించేవారి పిల్లలకు 70పాయింట్లు, తమ తోబుట్టువులు చదువుతూ ఉంటే వారికి 20శాతం, తల్లిదండ్రులు కూడా అదే స్కూల్లో చదివిన పిల్లలకు 5పాయింట్లు పోగా, మిగిలిన ఐదు పాయింట్లను మాత్రమే ఐఎస్టీ కేటగిరీకి కేటాయించారు. -
నర్సరీ అడ్మిషన్ల కేసు ఎడతెగని నిరీక్షణ
కొన్ని నెలలుగా కొనసాగుతున్న నర్సరీ అడ్మిషన్ల వ్యవహారం ఎంతకూ తెగకపోవడంతో పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే జూలై వరకు తరగతులు మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదని కొంతమంది ప్రిన్సిపాల్స్ అంటున్నారు. న్యూఢిల్లీ:నర్సరీ అడ్మిషన్లు పొందిన చిన్నారులకు ఈ నెల 15 నుంచి తరగతులు మొదలవుతాయని పాఠశాలల యాజమాన్యాలు శుక్రవారం దాకా ఈ-మెయిల్స్, ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందించాయి. అయితే శుక్రవారం మధ్యాహ్నం తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అడ్మిషన్ల ప్రక్రియపై స్టే విధిస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించడంతో అటు పాఠశాలల యాజమాన్యాలు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయానికి గురయ్యారు. అడ్మిషన్ల పాయింట్ల కేటాయింపుపై జనవరి నుంచి కొనసాగుతున్న వివాదాలు, కోర్టు కేసులు ఎంతకీ తేలకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అడ్మిషన్ల ప్రక్రియలో తరచూ మార్పులు చేయడంపై అంతటా నిరసన వ్యక్తమవుతోంది. పాయింట్ల కేటాయింపు, డ్రాల నిర్వహణపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో న్యాయస్థానాల జోక్యం అనివార్యమయింది. తాజాగా కోర్టు ఆదేశాల మేరకు అడ్మిషన్ల ప్రక్రియను నిలిపి వేస్తున్నట్టు టీచర్లు మళ్లీ సమాచారం పంపించారు. అంతర్రాష్ట్ర బదిలీల (ఐఎస్టీ) ద్వారా పాయింట్లు వచ్చిన విద్యార్థులకు మినహా మిగతా వాళ్లందరికీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించాలని ఢిల్లీ హైకోర్టు ఈ నెల మూడున మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఐఎస్టీ పాయింట్ల వివాదంపై ఈ నెల 16న విచారణ స్వీకరిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మొత్తం ప్రక్రియనే తాత్కాలికంగా నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ‘మా పాఠశాలలోనే 225లో 124 సీట్లను ఇది వరకే భర్తీ చేశాం. కొందరైతే యూనిఫారాలు, పుస్తకాలు కూడా కొనుగోలు చేసి ఫీజులూ చెల్లించారు. మా విద్యార్థుల చెల్లెళ్లు/తమ్ముళ్లకు కూడా కొన్ని సీట్లు ఇచ్చాం. 70 పాయింట్లు వచ్చినా, సీట్లు దక్కని వారి గురించే ఆందోళనగా ఉంది’ అని పీతంపురాలోని మహారాజ అగ్రసేన్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మంచిదేనని, అది తుది నిర్ణయం తీసుకునే వరకు యాజమాన్యాలు కచ్చితంగా నిరీక్షించాలని స్ప్రింగ్డేల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ అమితాముల్లా వట్టల్ అన్నారు. ఐఎస్టీ పాయింట్లను ఫిబ్రవరి 27న రద్దు చేసిన తరువాత నుంచి ఇప్పటి వరకు తాము డ్రాలు నిర్వహించలేదని తెలిపారు. సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేదాకా తరగతులు నిర్వహించే ప్రశ్నే లేదని ఆమె స్పష్టీకరించారు. వికలాంగులకు పాయింట్ల కేటాయింపుపైనా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. లక్ష్మణ్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉషారామ్ మాట్లాడుతూ 70 పాయింట్లే ఉన్న చిన్నారులకు అడ్మిషన్లు ఇవ్వకపోవడమే మంచిదయిందని, లేకుంటే ఇబ్బందులు ఎదురయ్యేవని అన్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు తరగతులు ప్రారంభించినా, కోర్టు స్టే మేరకు నిలిపివేశామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జూలై వరకు తరగతులు మొదలయ్యే అవకాశాలు లేవని మరో ప్రిన్సిపాల్ అన్నారు. స్థానిక కోటాలో 70 పాయింట్లు సాధించిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడానికి తాజాగా డ్రాలు నిర్వహించాలంటూ ఈ నెల ఆరున కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ చిన్నారులకు డ్రాలో ఇది వరకే అడ్మిషన్లు వచ్చాయని, కోర్టు ఆదేశాల మేరకు మరోసారి డ్రా తీస్తే మళ్లీ మొదటి నుంచీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుందని బెంచ్‌కు విన్నవించారు. తల్లిదండ్రులు వేరే రాష్ట్రాల నుంచి ఢిల్లీకి బదిలీ అయితే, వాళ్ల పిల్లలకు ఐదు పాయింట్లు కేటాయించడాన్ని రద్దు చేస్తూ గత నెల 27న లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేయడంతో ఈ వివాదం మొదలయింది. సంబంధిత పాఠశాలకు ఎనిమిది కిలోమీటర్ల లోపు నివసించే చిన్నారులకు 70 పాయింట్లు కేటాయిస్తారు. ఇది వరకే 70 పాయింట్లతో అడ్మిషన్లు దక్కించుకున్న చిన్నారులకు మళ్లీ డ్రాలు అవసరం లేదని ఎల్జీ పేర్కొన్నారు. 70 పాయింట్లతో వెయిటింగ్ లిస్టులో ఉండి, అంతర్రాష్ట్ర బదిలీల వల్ల 75 పాయింట్లు వచ్చిన వారి పేర్లను డ్రాలో చేర్చాలని ఆదేశించారు. అయితే అందరు చిన్నారులకూ తాజాగా డ్రాలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈ నెల ఆరున జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనివల్ల తమకు నష్టం జరుగుతుందని ఇది వరకే అడ్మిషన్లు దక్కిన బాలల తల్లిదండ్రులు వాదించారు. తాజా వివాదం ఐఎస్టీ తల్లిదండ్రుల పిల్లలకు ఐదు పాయింట్లు కేటాయించడాన్ని రద్దు చేస్తూ గత నెల 27న లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఐఎస్టీలకు పాయింట్లు ఇవ్వడం వల్ల తన కక్షిదారుల చిన్నారులకు డ్రాల్లో సీట్లు వచ్చాయని, అయితే ఈ విధానాన్ని రద్దు చేయడంతో వారంతా సీట్లను ఖాళీ చేయాల్సి వస్తోందని బాధిత తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆదేశించడంతో తాజాగా స్టే జారీ అయింది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం మొత్తం 100 పాయింట్లలో స్థానిక విద్యార్థులకు (నైబర్‌హుడ్) 70 కేటాయిస్తారు. ఇది వరకే స్కూల్లో చదువుతున్న విద్యార్థి తోబుట్టువులు దరఖాస్తు చేసుకుంటే వారికి 20 పాయింట్లు ఇస్తారు. తల్లిదండుల్లో ఎవరో ఒకరు సదరు పాఠశాల పూర్వ విద్యార్థులు అయితే దరఖాస్తుదారుడికి ఐదు పాయింట్లు ఇస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి (అంతరాష్ట్ర బదిలీలు) వచ్చి అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఐదు పాయింట్లు కేటాయించాలనుకున్నా, ఇవి దుర్వినియోగం అవుతాయని ఫిర్యాదులు రావడంతో రద్దు చేశారు. 75 నుంచి 100 మధ్య పాయింట్ల మధ్య వచ్చిన వారి పేర్లు మాతమే అడ్మిషన్ల కోసం తీసే డ్రాలో ఉంచుతారు. 90 పాయింట్లు వచ్చిన వారికి కచ్చితంగా అడ్మిషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అడ్మిషన్లపై కమిటీ వేయాలని విజ్ఞప్తి ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు అత్యున్నతస్థాయి కమిటీని నియమించాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు రాష్ట్ర బీజేపీ శనివారం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ జగ్‌కు లేఖ రాశారు. ఇది రోజువారీగా అడ్మిషన్ల ప్రక్రియను పరిశీలిస్తూ ఎల్జీకి నివేదిక సమర్పించాలని అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాల్లోనూ 6-14 ఏళ్ల లోపు విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్లు ఇవ్వాలని లేఖలో వర్ధన్ పేర్కొన్నారు. అన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ పేద విద్యార్థులకు 24 శాతం సీట్లు కేటాయించడం తప్పనిసరని తెలిపారు. ఇలాంటి వారి నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ డొనేషన్లు లేదా ఇతర రూపంలో డబ్బులు వసూలు చేయవద్దని కోరారు. నిబంధనలను ఉల్లంఘించిన పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్షవర్ధన్ సదరు లేఖలో కోరారు. -
నర్సరీ అడ్మిషన్లపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: నర్సరీ అడ్మిషన్లపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. అడ్మిషన్ల ప్రక్రియలోభాగంగా తాజా డ్రాపై హైకోర్టు ఇదివరకే స్టే విధించిన నేపథ్యంలో స్టేను ఎప్పుడు ఎత్తివేస్తారా? అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఇటువంటి సమయంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులను మరింత నిరాశపర్చింది. గతంలో తాను విధించిన స్టే శుక్రవారం వరకు కొనసాగుతుందని హైకోర్టు బుధవారం స్పష్టంచేసింది. నర్సరీ అడ్మిషన్ల విధివిధానాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ఎయిడెడ్ పాఠశాలల్లో నర్సరీ అడ్మిషన్లకు సంబంధించి డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఢిల్లీ ప్రభుత్వం సమర్పించిన వివరాలను కోర్టు తిరస్కరించింది. ఎన్ని పాఠశాలలు ఉన్నాయి? అందులో సీట్ల సంఖ్య ఎంత? ఏయే వర్గాలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే విధివిధానాలున్నాయి? తదితర పూర్తి వివరాలతో తాజా నివేదికను అందజేయాలని డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఢిల్లీ ప్రభుత్వాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్, న్యాయమూర్తి సిద్ధార్థ్ మృదుల్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వ న్యాయవాది సవివరంగా ఇచ్చిన వివరణతో కోర్టు సంతృప్తి చెందలేదు. ‘సమీప ప్రాంతాల’వారికి ప్రాధాన్యం ఇచ్చిన విషయం సరైనదే అయినప్పటికీ నర్సరీ అడ్మిషన్లలో ఎదురవుతున్న పెద్ద పెద్ద విషయాలపై మార్గదర్శకాల్లో స్పష్టత లోపించిందనే అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసింది. మరి వీటి మాటేంటి? అని ప్రశ్నించింది. ఇక్కడ డిమాండ్-సప్లయి సమస్య ప్రధానమైనదని, సీట్లు తక్కువగా ఉండడం, ఆశిస్తున్నవారు ఎక్కువగా ఉండడం ప్రధాన సమస్యగా కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. దీనిని పరిష్కరించేందుకు ఏం చేస్తారంటూ ప్రశ్నించింది. ఏటా ఈ విషయమై దాఖలవుతున్న పిటిషన్ల సంఖ్య పెరుగుతోందని, కోర్టుకు వస్తున్నవారి సంఖ్యతో హాలు కిక్కిరిసిపోతోందని అసహనం వ్యక్తం చేసింది. అడ్మిషన్ కోసం అవసరమైన 100 మార్కులకుగాను 70 మార్కులను ‘సమీప ప్రాంతాల’వారికి (0 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో ఉంటున్నవారికి) ఇస్తుండగా అడ్మిషన్ కోరుతున్నవారి తోబుట్టువులెవరైనా అదే పాఠశాలలో చదివితే మరో 20 మార్కులు ఇస్తున్నారు. వారి తల్లిదండ్రులు అదే పాఠశాలకు చెందిన పూర్వవిద్యార్థులైతే మరో ఐదు మార్కులు కలుపుతున్నారు. ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ నిబంధనకు సంబంధించి ఇస్తున్న ఐదు మార్కులను ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే తొలగించింది. ఈ విధివిధానాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ కొందరు తల్లిదండ్రులు, అన్ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. తోబుట్టువులు అదే పాఠశాలలో చదివితే ఇస్తున్న 20 మార్కులను, తల్లిదండ్రులు పూర విద్యార్థులైతే ఇస్తున్న 5 మార్కులను తొలగించాలని పలువురు పిటిషన్లు వేశారు. వీటిపై కోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. -
మా మార్గదర్శకాలు మంచివే!
సాక్షి, న్యూఢిల్లీ: నర్సరీ అడ్మిషన్లకు సంబంధించి తాను జారీ చేసిన మార్గదర్శకాలను లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్‌జంగ్ సమర్థించుకున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. నర్సరీ అడ్మిషన్లలో మేనేజ్మెంట్ కోటాను రద్దు చేయడం సరైందేనని స్పష్టీకరిం చారు. విద్యను వాణిజ్యపరం చేయడాన్ని అనుమతించదరాదని పేర్కొన్నారు. నర్సరీ అడ్మిషన్లపై లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన మార్గదర్శకాలను రద్దు చేయాలని కోరుతూ యాక్షన్ కమిటీ ఆఫ్ అన్ఎయిడెడ్ రికగ్నైజ్డ్ పబ్లిక్ స్కూల్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై హైకోర్టు జారీచేసిన నోటీసుకు లెఫ్టినెంట్ గవర్నర్ సమాధానమిచ్చారు. ఈ కేసు తదుపరి విచారణ మార్చ్ 25న నిర్వహిస్తామని ఉన్నతన్యాయస్థానం తెలిపింది. తాను జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ న్యాయస్థానాన్ని కోరారు. ‘విద్యను వ్యాపారంగా మార్చడం నిషిద్ధం. విద్యాసంస్థలను బోధన దుకాణాలుగా కొనసాగనివ్వరాదు. అది పిల్లలకు సమాన అవకాశాలను అందించకుండా చేస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధానిలో నర్సరీ అడ్మిషన్ల జారీకి డిసెంబర్ 18న లెఫ్టినెంట్ గవర్నర్ మార్గదర్శకాలను జారీ చేశారు. మేనేజ్మెంట్ కోటాను రద్దు చేయడంతోపాటు పాయింట్ల విధానానికి మార్గదర్శకాలు ప్రాధాన్యం ఇచ్చాయి. స్థానిక బాలలకు (నేబర్హుడ్) అడ్మిషన్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాయి. నేబర్హుడ్ కేటగిరీ కింద పాఠశాలకు ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో నివసించేవారికి అత్యధిక పాయింట్లను కేటాయించారు. వాటిని రద్దు చేయాలని ప్రైవేటు పాఠశాలలు సుప్రీంకోర్టును ఆశ్రయించినా, జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. తిరిగి హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు మార్గదర్శకాల ప్రకారమే జరగాలని హైకోర్టు ఆదేశించింది. కేసుపై తరువాత విచారణ జరుపుతానని పేర్కొంది. -
నర్సరీ అడ్మిషన్లపై తీర్పు రిజర్వ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ అడ్మిషన్ల ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ వ్యవహారంపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేయడంతో...సర్కార్ అడ్మిషన్ల ప్రక్రియపై ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అయితే నర్సరీ అడ్మిషన్ల ప్రక్రియ జనవరి 15కు బదులు 17 నుంచి ప్రారంభిస్తామని ప్రకటించిన సర్కార్, ఇప్పుడు కోర్టు తీర్పు వెలువడే వరకు వేచిచూద్దామనే ధోరణిలో ఉంది. ఈ మేరకు తీర్పు వెలువడిన తర్వాతే నర్సరీ అడ్మిషన్లను ప్రారంభిస్తామని ఢిల్లీ ప్రభుత్వం న్యాయస్థానానికి హామీ ఇచ్చింది. నర్సరీ అడ్మిషన్ల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ మార్గదర్శకాలే ఈ ఏడాదికి వర్తిస్తాయని ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ అన్ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలు డబుల్ బెంచ్‌ను ఆశ్రయించాయి. దీనిపై బుధవారం నాలుగు గంటల పాటు హైకోర్టులో వాదనలు జరిగాయి. నర్సరీ అడ్మిషన్లపై మార్గదర్శకాలను జారీ చేసే అధికారం లెప్టినెంట్ గవర్నర్‌కు లేదని ప్రైవేటు స్కూళ్లు వాదిస్తున్నాయి. అది తమ స్వయం ప్రతిపత్తిని హరించడమేనని అంటున్నాయి. అయితే పాఠశాలకు, ఇంటికి దూరం నిర్దేశించే ఫార్ములా స్కూలు రికగ్నేషన్ చట్టం మార్గదర్శకాలలోనే ఉందని ప్రభుత్వం తెలిపింది. వీటిని సావధానంగా విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. దీనిపై ఒకటి రెండు రోజులలో తీర్పు రావచ్చని భావిస్తున్నారు. ఇదిలావుండగా ప్రభుత్వం నాణ్యైమైన విద్యను అందించడంలో విఫలమైందని న్యాయస్థానం అభిప్రాయపడింది. సరైన సర్కారీ పాఠశాలలు లేకపోవడం వల్ల పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిం చాల్సి వస్తోంది. మెరుగైన పాఠశాలలను ఏర్పాటుచేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. -
నర్సరీ అడ్మిషన్లలో సమస్యలుంటే కాల్ చెయ్యండి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై ఎలాంటి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా హెచ్చరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా తో కలిసి విద్యాశాఖ మంత్రి హెల్ప్‌లైన్ నంబర్‌ను సోమవారం ప్రారంభించారు. ప్రైవేటు పాఠశాల లకు సంబంధించి, ముఖ్యంగా నర్సరీ అడ్మిషన్లలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే తల్లిదండ్రులు వెంట నే 27352525 నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని వారు పేర్కొన్నారు. హెల్ప్‌లైన్ నంబర్ ప్రారం భం అనంతరం మొదటి కాల్ కేజ్రీవాల్ చేశారు. అయితే నంబర్ చాలాసార్లు బిజీ రావడం గమనార్హం. నర్సరీలో చిన్నారులను చేర్చుకునేందు కు డొనేషన్లు తీసుకున్నట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను విద్యాశాఖ మంత్రి మనీష్‌సిసోడియా హెచ్చరించారు. నర్సరీ అడ్మిషన్లకు సంబంధించి అన్ని వార్డులను విధిగా బోర్డుల్లో వెల్లడించాలని ఆయన సూచించారు. నర్సరీ అడ్మిషన్లలో ఎలాంటి ఇబ్బందులున్నా తల్లిదండ్రులు వెంటనే సంబంధిత విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయాలన్నారు. ఆ అధికారి నుంచి సరైన స్పందన లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ హెల్ప్‌లైన్ నంబర్‌కి ఫోన్ చేయవచ్చన్నారు. హెల్ప్‌లైన్ నంబర్‌కి వచ్చే ఫిర్యాదులకు సం బంధించి రోజువారీగా నివేదికలు సేకరించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.‘హెల్ప్‌లైన్ ఎలా పనిచేస్తుందో పరిశీలించేందుకు నేను కూడా రోజుకు కనీ సం పదిమార్లు కాల్చేస్తూ ఉంటా’అని తెలిపారు. ఫిర్యాదులు స్వీకరించేందుకు www.edudel.nic.in,వెబ్‌సైట్‌ను సైతం ప్రారంభించారు. కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరి భద్రత ఘజియాబాద్‌లోని కౌశాంబిలోని గిర్నార్ టవర్ వద్ద అపార్ట్మెంట్లో ఉంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరి కింద 14 మంది పోలీసులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిం ది. ‘సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి గల ఇద్దరు వ్యక్తిగత భద్రత అధికారులను నియమించాం. వీరికి ఎనిమి ది మంది భద్రత సిబ్బంది సహకరిస్తారు. హెడ్ కానిస్టేబుల్ నేతృత్వంలోని నలుగురు వ్యక్తిగత సిబ్బందితో ఓ ఎస్కార్ట్ వాహనం ఉంటుంద’ని స్థానిక నిఘా విభాగ సర్కిల్ అధికారి కమ్లేశ్ బహదూర తెలిపారు. ఈ నెల ఎనిమిదిన కౌశాంబిలో ఆప్ కార్యాలయంలో హిందూ రక్ష దళ్ కార్యకర్తలు దాడి చేయడంతో ఐదుగురు పోలీసులను కూడా అక్కడ నియమించిన సంగతి తెలిసిందే. భూషణ్ మీడియా సమావేశానికి అంతరాయం నగరంలోని ఇండియా ఉమెన్ ప్రెస్ కార్ప్స్(ఐడబ్ల్యూపీసీ) వద్ద ఆప్ నాయకుడు ప్రశాంత్ భూషణ్ గురువారం నిర్వహించిన మీడియా సమావేశానికి అంతరాయం కలిగింది. నర్మదా బచావో ఆందోళన్ సభ్యులతో కలిసి మాట్లాడేందుకు ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తాగా పేరు చెప్పుకొని కాన్ఫరె న్స్ రుమ్లోకి వచ్చి ప్రశాంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశం నుంచే ప్రశాంత్ భూషణ్‌ను కేజ్రీవాల్ తోసెయ్యాలన్నారు. ఆ వెంటనే ఆప్ కార్యకర్తలు అతడిని బయటకు పంపించివేసి ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. అయితే ఆప్ నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. జమ్మూ, కాశ్మీర్‌లోని సాయుధ దళంపై భూషణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
ఎల్జీ ఆదేశాలే ఫైనల్!
సాక్షి, న్యూఢిల్లీ: నర్సరీ అడ్మిషన్లకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన మార్గదర్శకాలపై స్టే విధించడానికి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరించడంతో ప్రైవేట్ స్కూళ్లకు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. మేనేజ్మెంట్ కోటాను రద్దు చేస్తూ , నైబర్‌హుడ్ క్రై టీరియాను సవరిస్తూ ఎల్జీ జారీచేసిన మార్గదర్శకాలను ప్రైవేట్ స్కూళ్లు వ్యతిరేకిస్తున్నాయి. నర్సరీ అడ్మిషన్లపై మార్గదర్శకాలు రూపొందించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి లేనందువల్ల 2014-15 విద్యాసంవత్సరపు నర్సరీ అడ్మిషన్ల కోసం లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన మార్గదర్శకాలను తొలగించాలని యాక్షన్ కమిటీ ఫర్ ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిని శుక్రవారం విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రైవేట్ స్కూళ్లు కోరినట్లుగా ఎల్జీ ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఉత్తర్వులను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని కోర్టు ప్రభుత్వానికి నోటీసు జారీచేసింది. అన్ని కోణాల నుంచి కేసును పరిశీలించిన తర్వాత తీర్పు ఇస్తానని పేర్కొంటూ ఈ కేసుపై విచారణను మార్చ్ 11 కు వాయిదా వేసింది. 2014-15 విద్యాసంవత్సరానికి నర్సరీ అడ్మిషన్లు ఎల్జీ జారీచేసిన మార్గదర్శకత్వాల ప్రకారమే జరుగుతాయని పేర్కొంది. ప్రతి ఏడాది నర్సరీ అడ్మిషన్ల సమయంలో మార్గదర్శకాలపై గందరగోళం లేకుండా ఒక విధానాన్ని రూపొందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలలకు 75 శాతం సీట్లకు సంబంధించి స్వయంగా అడ్మిషన్ క్రైటీరియా రూపొందించుకునే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించిందని, ఎల్జీ జారీచేసిన ఉత్తర్వులు తమ స్వయం ప్రతిపత్తిని హరించేవిగా ఉన్నాయని అందువల్ల వాటిని కోట్టివేయాలని ప్రైవేట్ పాఠశాలలు జనవరి 3న హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశాయి. కాగా, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ 2014 -15 నర్సరీ అడ్మిషన్ల కోసం డిసెంబర్ 18న మార్గదర్శకాలను జారీచేశారు. కొత్త మార్గదర్శకాలలో ఆయన 20 శాతం మేనేజ్మెంట్ కోటాను రద్దు చేయడంతో పాటు నైబర్‌హుడ్ క్రైటీరియాను ఆరు నుంచి ఎనిమిది కిమీ రేడియస్కు పొడిగించారు. అడ్మిషన్ 100 పాయింట్ల ప్రాతిపదికన జరగాలని, ఓపెన్ కేటగిరీ సీట్లలో అడ్మిషన్ కోసం నైబర్‌హుడ్ క్రైటీరియాకు 70 పాయింట్లు కేటాయించాలని పేర్కొన్నారు. తమ కుటుంబసభ్యులెవరైనా అదే పాఠశాలలో చదువుతున్నట్లయితే దరఖాస్తు దారులకు 20 పాయింట్లు లభిస్తాయి. దరఖాస్తుదారులు పూర్వ విద్యార్థుల పిల్లలు, ఆడపిల్లలు అయినట్లయితే ఐదేసి పాయిం ట్లు కలసి వస్తాయి. పాఠశాల సిబ్బంది పిల్లలతో పాటు మనువలు, మనువరాళ్లకు సైతం ఐదు పాయింట్లు లభిస్తాయి. మైనారిటీ పాఠశాలలు కూడా 25 శాతం సీట్లను ఆర్థికంగా బలహీనవర్గాలు, సమాజంలోని ఇతర బలహీనవర్గాల పిల్లల కోసం కేటాయించాలని కూడా కొత్త మార్గదర్శకాలు నిర్దేశించాయి. ప్రైవేట్ స్కూళ్లలో నర్మరీ అడ్మిషన్ల ప్రక్రియ జనవరి 15 నుంచి ప్రారం భం కానుంది. దరఖాస్తులు సమర్పించడానికి జనవరి 31 ఆఖరి తేదీ.