న్యూఢిల్లీ: నర్సరీ అడ్మిషన్లపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. అడ్మిషన్ల ప్రక్రియలోభాగంగా తాజా డ్రాపై హైకోర్టు ఇదివరకే స్టే విధించిన నేపథ్యంలో స్టేను ఎప్పుడు ఎత్తివేస్తారా? అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఇటువంటి సమయంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులను మరింత నిరాశపర్చింది. గతంలో తాను విధించిన స్టే శుక్రవారం వరకు కొనసాగుతుందని హైకోర్టు బుధవారం స్పష్టంచేసింది. నర్సరీ అడ్మిషన్ల విధివిధానాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో నర్సరీ అడ్మిషన్లకు సంబంధించి డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఢిల్లీ ప్రభుత్వం సమర్పించిన వివరాలను కోర్టు తిరస్కరించింది.
ఎన్ని పాఠశాలలు ఉన్నాయి? అందులో సీట్ల సంఖ్య ఎంత? ఏయే వర్గాలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే విధివిధానాలున్నాయి? తదితర పూర్తి వివరాలతో తాజా నివేదికను అందజేయాలని డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఢిల్లీ ప్రభుత్వాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్, న్యాయమూర్తి సిద్ధార్థ్ మృదుల్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వ న్యాయవాది సవివరంగా ఇచ్చిన వివరణతో కోర్టు సంతృప్తి చెందలేదు. ‘సమీప ప్రాంతాల’వారికి ప్రాధాన్యం ఇచ్చిన విషయం సరైనదే అయినప్పటికీ నర్సరీ అడ్మిషన్లలో ఎదురవుతున్న పెద్ద పెద్ద విషయాలపై మార్గదర్శకాల్లో స్పష్టత లోపించిందనే అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసింది. మరి వీటి మాటేంటి? అని ప్రశ్నించింది. ఇక్కడ డిమాండ్-సప్లయి సమస్య ప్రధానమైనదని, సీట్లు తక్కువగా ఉండడం, ఆశిస్తున్నవారు ఎక్కువగా ఉండడం ప్రధాన సమస్యగా కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది.
దీనిని పరిష్కరించేందుకు ఏం చేస్తారంటూ ప్రశ్నించింది. ఏటా ఈ విషయమై దాఖలవుతున్న పిటిషన్ల సంఖ్య పెరుగుతోందని, కోర్టుకు వస్తున్నవారి సంఖ్యతో హాలు కిక్కిరిసిపోతోందని అసహనం వ్యక్తం చేసింది. అడ్మిషన్ కోసం అవసరమైన 100 మార్కులకుగాను 70 మార్కులను ‘సమీప ప్రాంతాల’వారికి (0 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో ఉంటున్నవారికి) ఇస్తుండగా అడ్మిషన్ కోరుతున్నవారి తోబుట్టువులెవరైనా అదే పాఠశాలలో చదివితే మరో 20 మార్కులు ఇస్తున్నారు. వారి తల్లిదండ్రులు అదే పాఠశాలకు చెందిన పూర్వవిద్యార్థులైతే మరో ఐదు మార్కులు కలుపుతున్నారు. ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌ఫర్ నిబంధనకు సంబంధించి ఇస్తున్న ఐదు మార్కులను ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే తొలగించింది.
ఈ విధివిధానాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ కొందరు తల్లిదండ్రులు, అన్‌ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. తోబుట్టువులు అదే పాఠశాలలో చదివితే ఇస్తున్న 20 మార్కులను, తల్లిదండ్రులు పూర విద్యార్థులైతే ఇస్తున్న 5 మార్కులను తొలగించాలని పలువురు పిటిషన్లు వేశారు. వీటిపై కోర్టు శుక్రవారం విచారణ జరపనుంది.
నర్సరీ అడ్మిషన్లపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
Published Tue, Mar 25 2014 10:17 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement