నర్సరీ అడ్మిషన్లపై తీర్పు రిజర్వ్
Published Wed, Jan 15 2014 11:10 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
సాక్షి, న్యూఢిల్లీ: ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ అడ్మిషన్ల ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ వ్యవహారంపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేయడంతో...సర్కార్ అడ్మిషన్ల ప్రక్రియపై ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అయితే నర్సరీ అడ్మిషన్ల ప్రక్రియ జనవరి 15కు బదులు 17 నుంచి ప్రారంభిస్తామని ప్రకటించిన సర్కార్, ఇప్పుడు కోర్టు తీర్పు వెలువడే వరకు వేచిచూద్దామనే ధోరణిలో ఉంది. ఈ మేరకు తీర్పు వెలువడిన తర్వాతే నర్సరీ అడ్మిషన్లను ప్రారంభిస్తామని ఢిల్లీ ప్రభుత్వం న్యాయస్థానానికి హామీ ఇచ్చింది.
నర్సరీ అడ్మిషన్ల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ మార్గదర్శకాలే ఈ ఏడాదికి వర్తిస్తాయని ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ అన్‌ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలు డబుల్ బెంచ్‌ను ఆశ్రయించాయి. దీనిపై బుధవారం నాలుగు గంటల పాటు హైకోర్టులో వాదనలు జరిగాయి. నర్సరీ అడ్మిషన్లపై మార్గదర్శకాలను జారీ చేసే అధికారం లెప్టినెంట్ గవర్నర్‌కు లేదని ప్రైవేటు స్కూళ్లు వాదిస్తున్నాయి. అది తమ స్వయం ప్రతిపత్తిని హరించడమేనని అంటున్నాయి. అయితే పాఠశాలకు, ఇంటికి దూరం నిర్దేశించే ఫార్ములా స్కూలు రికగ్నేషన్ చట్టం మార్గదర్శకాలలోనే ఉందని ప్రభుత్వం తెలిపింది. వీటిని సావధానంగా విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. దీనిపై ఒకటి రెండు రోజులలో తీర్పు రావచ్చని భావిస్తున్నారు. ఇదిలావుండగా ప్రభుత్వం నాణ్యైమైన విద్యను అందించడంలో విఫలమైందని న్యాయస్థానం అభిప్రాయపడింది. సరైన సర్కారీ పాఠశాలలు లేకపోవడం వల్ల పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిం చాల్సి వస్తోంది. మెరుగైన పాఠశాలలను ఏర్పాటుచేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది.
Advertisement
Advertisement