సాక్షి, న్యూఢిల్లీ: నర్సరీ అడ్మిషన్లకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన మార్గదర్శకాలపై స్టే విధించడానికి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరించడంతో ప్రైవేట్ స్కూళ్లకు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. మేనేజ్‌మెంట్ కోటాను రద్దు చేస్తూ , నైబర్‌హుడ్ క్రై టీరియాను సవరిస్తూ ఎల్జీ జారీచేసిన మార్గదర్శకాలను ప్రైవేట్ స్కూళ్లు వ్యతిరేకిస్తున్నాయి. నర్సరీ అడ్మిషన్లపై మార్గదర్శకాలు రూపొందించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి లేనందువల్ల 2014-15 విద్యాసంవత్సరపు నర్సరీ అడ్మిషన్ల కోసం లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన మార్గదర్శకాలను తొలగించాలని యాక్షన్ కమిటీ ఫర్ ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిని శుక్రవారం విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రైవేట్ స్కూళ్లు కోరినట్లుగా ఎల్జీ ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఉత్తర్వులను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని కోర్టు ప్రభుత్వానికి నోటీసు జారీచేసింది. అన్ని కోణాల నుంచి కేసును పరిశీలించిన తర్వాత తీర్పు ఇస్తానని పేర్కొంటూ ఈ కేసుపై విచారణను మార్చ్ 11 కు వాయిదా వేసింది. 2014-15 విద్యాసంవత్సరానికి నర్సరీ అడ్మిషన్లు ఎల్జీ జారీచేసిన మార్గదర్శకత్వాల ప్రకారమే జరుగుతాయని పేర్కొంది. ప్రతి ఏడాది నర్సరీ అడ్మిషన్ల సమయంలో మార్గదర్శకాలపై గందరగోళం లేకుండా ఒక విధానాన్ని రూపొందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది.
ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలలకు 75 శాతం సీట్లకు సంబంధించి స్వయంగా అడ్మిషన్ క్రైటీరియా రూపొందించుకునే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించిందని, ఎల్జీ జారీచేసిన ఉత్తర్వులు తమ స్వయం ప్రతిపత్తిని హరించేవిగా ఉన్నాయని అందువల్ల వాటిని కోట్టివేయాలని ప్రైవేట్ పాఠశాలలు జనవరి 3న హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశాయి. కాగా, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ 2014 -15 నర్సరీ అడ్మిషన్ల కోసం డిసెంబర్ 18న మార్గదర్శకాలను జారీచేశారు. కొత్త మార్గదర్శకాలలో ఆయన 20 శాతం మేనేజ్‌మెంట్ కోటాను రద్దు చేయడంతో పాటు నైబర్‌హుడ్ క్రైటీరియాను ఆరు నుంచి ఎనిమిది కిమీ రేడియస్‌కు పొడిగించారు.
అడ్మిషన్ 100 పాయింట్ల ప్రాతిపదికన జరగాలని, ఓపెన్ కేటగిరీ సీట్లలో అడ్మిషన్ కోసం నైబర్‌హుడ్ క్రైటీరియాకు 70 పాయింట్లు కేటాయించాలని పేర్కొన్నారు. తమ కుటుంబసభ్యులెవరైనా అదే పాఠశాలలో చదువుతున్నట్లయితే దరఖాస్తు దారులకు 20 పాయింట్లు లభిస్తాయి. దరఖాస్తుదారులు పూర్వ విద్యార్థుల పిల్లలు, ఆడపిల్లలు అయినట్లయితే ఐదేసి పాయిం ట్లు కలసి వస్తాయి. పాఠశాల సిబ్బంది పిల్లలతో పాటు మనువలు, మనువరాళ్లకు సైతం ఐదు పాయింట్లు లభిస్తాయి. మైనారిటీ పాఠశాలలు కూడా 25 శాతం సీట్లను ఆర్థికంగా బలహీనవర్గాలు, సమాజంలోని ఇతర బలహీనవర్గాల పిల్లల కోసం కేటాయించాలని కూడా కొత్త మార్గదర్శకాలు నిర్దేశించాయి. ప్రైవేట్ స్కూళ్లలో నర్మరీ అడ్మిషన్ల ప్రక్రియ జనవరి 15 నుంచి ప్రారం భం కానుంది. దరఖాస్తులు సమర్పించడానికి జనవరి 31 ఆఖరి తేదీ.
ఎల్జీ ఆదేశాలే ఫైనల్!
Published Fri, Jan 10 2014 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement