
ఢిల్లీ : కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో గత శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో (New Delhi Railway Station Stampede) తొక్కిసలాట జరిగింది. ఆ దుర్ఘటనపై కేంద్రం, భారతీయ రైల్వే శాఖపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.
రైల్వే కోచ్‌లో నిర్ధిష్ట ప్రయాణికుల సంఖ్య కంటే ఎక్కువ మందిని ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. ట్రైన్ టికెట్లు ఎందుకు ఎక్కువగా అమ్ముతున్నారని మండిపడింది. ఇదే అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట దుర్ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై ఇవాళ (ఫిబ్రవరి 19) విచారణ చేపట్టింది. విచారణ సమయంలో పైవిధంగా స్పందించింది.
కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో గత శనివారం (ఫిబ్రవరి 17,2025) రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై దాఖలైన పిల్‌పై ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ్, జస్టిస్ తుషార్ రావు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. విచారణ సమయంలో పరిమితికి మించి టికెట్లను ఎందుకు అమ్ముతున్నారని అటు కేంద్రాన్ని, ఇటు రైల్వే శాఖను ప్రశ్నించింది.
ఈ సందర్భంగా రైల్వే ప్రమాదాల్ని నివారించేందుకు ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేంద్రం,రైల్వే శాఖకు పలు సూచనలు ఇచ్చింది.రైల్వే చట్టం సెక్షన్ 147 ప్రకారం, ఒక కోచ్‌లో ప్రయాణికుల సంఖ్య పరిమితి ఉండాలి. ఈ చట్టం ప్రకారం పరిమితికి మించి ప్రయాణికుల్ని అనుమతిస్తే 1,000 రూపాయల జరిమానా,అలాగే ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చు.
ఈ చర్యలు తీసుకోకపోతే ప్రస్తుతం ఉన్న చట్టాల్ని అమలు చేయండి. టిక్కెట్లు అమ్మే ప్రక్రియను కట్టుదిట్టం చేయండి. భవిష్యత్‌లో రైల్వే ప్రమాదాల్ని నివారించవచ్చు. జస్టిస్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. రద్దీ సమయాల్లో కొంతమేర పరిమితి మించినా, ఆ స్థాయిలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి. ఈ అంశంపై నిర్లక్ష్యం చేస్తే ఈ తరహా దుర్ఘటనకు దారి తీస్తుంది’ అని అన్నారు.
రైల్వే శాఖ తరుఫున ప్రముఖ అడ్వకేట్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో తన వాదనల్ని వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మార్చి 26కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment