ఆరోగ్య రంగంపై నజీబ్ నజర్
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగం పనితీరు క్రమబద్ధీకరణపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ దృష్టి సారించారు. ఆపరేషన్ థియేటర్ల వంటి కీలక విభాగాల్లో ఎటువంటి లోపాలు లేకుండా చేసేందుకుగాను ప్రజాపనుల విభాగంతో సంప్రదింపులు జరిపి తగు వ్యవస్థను రూపొందించాలంటూ ఆరోగ్య శాఖ అధికారులను శుక్రవారం ఆదేశించారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై పలు అంశాలను సమీక్షించారు. అధికారులు ఆస్పత్రుల నవీకరణ, పరిశీలన విషయంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎమ్సీడీ) వ్యవహరిస్తున్న తీరును పరిశీలించాలని కోరారు. దీంతోపాటు రోగులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చేందుకు వీలుగా తగినన్ని అంబులెన్సు సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ఆస్పత్రికి చేరిన రోగికి సకల సదుపాయాలు ఉండేవిధంగా చూడడంతోపాటు వారికి తక్షణమే అవసరమైన సేవలు అందేవిధంగా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. అత్యవసర విభాగంలో వైద్యులతోపాటు సిబ్బంది అన్నివేళలా అందుబాటులో ఉండేవిధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అత్యసవర సేవల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇందుకు ఆరోగ్య శాఖ కార్యదర్శి స్పందిస్తూ నగరంలోని 36 ఆస్పత్రులు ఎంతో బాగా సేవలందిస్తున్నాయన్నారు. తరచూ వీటిని తనిఖీ చేసేందుకుగాను ఎనిమిది బృందాలను నియమించామన్నారు. డిస్పెన్సరీలను సైతం తరచూ తాము తనిఖీ చేస్తున్నామన్నారు. ఔట్ పేషంట్ విభాగాల (ఓపీడీ) వద్ద రోగులు బారులు తీరే పరిస్థితి రాకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా మందుల కొరత సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.