Department of Health Secretary
-
మూడో వేవ్‌పై అప్రమత్తత అవసరం
నాగార్జునసాగర్/ మిర్యాలగూడ/ నకిరేకల్: కరోనా మూడో వేవ్‌పై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి రిజ్వీ ఆదేశించారు. ఆదివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్‌లలో నిర్వహించిన సమావేశాల్లో వైద్య సిబ్బంది, అధికారులకు పలు సూచనలు చేశారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న గ్రామాల్లో టెస్టింగ్ క్యాంపులు ఏర్పాటుచేయాలని, కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రధానంగా వివాçహాలు, జాతరలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సీజనల్ వ్యాధులపైనా నజర్ ► ఆదివారం జిల్లాల్లో పర్యటించిన ఉన్నత స్థాయి బృందం పలు కీలక సూచనలు చేసింది. జిల్లాల్లో టెస్టుల సంఖ్యను పెంచాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని పేర్కొంది. ముఖ్యంగా ఫీవర్ సర్వేకు సంబంధించి ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ అంశాలివీ.. ► నాలుగో విడత ఫీవర్ సర్వేను పటిష్టంగా నిర్వహించాలి. విద్య, ఐసీడీఎస్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని కొనసాగించాలి. ► కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ఐసోలేషన్ కిట్లు అందించాలి. ►కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాల్లో వైద్య సేవలు అందించాలి. వారు అంతకుముందు మూడు నాలుగు రోజుల్లో ఎవరిని కలిశారో గుర్తించి వారికి కరోనా టెస్టులు చేయాలి. ►సరిహద్దు జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో కరోనా వైరస్ సోకకుండా గట్టి నిఘా పెంచాలి. మండల, జిల్లా స్థాయి బృందాలు ఆ దిశగా పటిష్ట చర్యలు తీసుకోవాలి. ►జిల్లాల్లో టెస్టుల సంఖ్య పెంచాలి. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి. ప్రతి పీహెచ్సీలో మందులను అందుబాటులో ఉంచాలి. ►రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున సీజనల్, అంటువ్యాధులు, దోమలు, ఇతర కీటకాల ద్వారా వ్యాపించే జబ్బులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. ►జిల్లా వైద్యాధికారులు, ఏరియా ఆస్పత్రుల పర్యవేక్షకులు, సర్వే అధికారులు రోజూ సమస్యలపై విశ్లేషించుకొని చర్యలు చేపట్టాలి. ► పీహెచ్‌సీల వారీగా వైద్యాధికారులు ఫీవర్ సర్వేలో తప్పక పాల్గొనాలి. ముఖ్యంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి. క్షేత్రస్థాయి పర్యటనలు చేసి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి. ► వైద్యాధికారులు, డాక్టర్లు విధుల్లో తప్పక ఉండాలి. సెలవులు పెట్టకూడదు. -
అమెరికా హెల్త్ సెక్రటరీగా హావియర్
వాషింగ్టన్: అమెరికా ఆరోగ్య శాఖ (సెక్రెటరీ ఆఫ్ హెల్త్), హ్యూమన్ సర్వీసెస్ మంత్రిగా హావియర్ బసెరా ఎంపికయ్యారు. అలాగే, భారతీయ అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని సర్జన్ జనరల్‌గా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ఎంపిక చేసుకున్నారు. కోవిడ్–19 విషయంలో అమెరికా అధ్యక్షుడి చీఫ్ మెడికల్ అడ్వైజర్‌గా డాక్టర్ ఆంథోనీ ఫౌచీ, వ్యాధుల నియంత్రణ కేంద్రాల డైరెక్టర్‌గా డాక్టర్ రోచెల్ వాలెన్స్కీ, కోవిడ్–19 ఈక్విటీ టాస్క్‌ఫోర్స్ అధినేతగా డాక్టర్ మార్సెలా నూనెజ్ స్మిత్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆరోగ్య రంగంలో కరోనా మహమ్మారి రూపంలో అమెరికా అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని జో బైడెన్ పేర్కొన్నారు. మహమ్మారిని అదుపు చేసి, జన జీవనం ఎప్పటిలాగే కొనసాగే వాతావరణం కల్పించాల్సి ఉందన్నారు. హెల్త్ కేర్ టీమ్‌లోని నిపుణుల సూచనల ప్రకారం కరోనా వైరస్ వ్యాప్తిని కచ్చితంగా నియంత్రిస్తామని, దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెడతామని కాబోయే ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వెల్లడించారు. హావియర్ బసెరా ప్రస్తుతం కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఇక డాక్టర్ వివేక్ మూర్తి 2014 నుంచి 2017 వరకు అమెరికాస్ డాక్టర్ అనే పదవిలో ఉన్నారు. జో బైడెన్‌కు ఆయన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్–19 ట్రాన్సిషన్ అడ్వైజరీ బోర్డు కో–చైర్మన్‌గా ఉన్నారు. -
ఆరోగ్య రంగంపై నజీబ్ నజర్
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగం పనితీరు క్రమబద్ధీకరణపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ దృష్టి సారించారు. ఆపరేషన్ థియేటర్ల వంటి కీలక విభాగాల్లో ఎటువంటి లోపాలు లేకుండా చేసేందుకుగాను ప్రజాపనుల విభాగంతో సంప్రదింపులు జరిపి తగు వ్యవస్థను రూపొందించాలంటూ ఆరోగ్య శాఖ అధికారులను శుక్రవారం ఆదేశించారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై పలు అంశాలను సమీక్షించారు. అధికారులు ఆస్పత్రుల నవీకరణ, పరిశీలన విషయంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎమ్సీడీ) వ్యవహరిస్తున్న తీరును పరిశీలించాలని కోరారు. దీంతోపాటు రోగులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చేందుకు వీలుగా తగినన్ని అంబులెన్సు సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆస్పత్రికి చేరిన రోగికి సకల సదుపాయాలు ఉండేవిధంగా చూడడంతోపాటు వారికి తక్షణమే అవసరమైన సేవలు అందేవిధంగా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. అత్యవసర విభాగంలో వైద్యులతోపాటు సిబ్బంది అన్నివేళలా అందుబాటులో ఉండేవిధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అత్యసవర సేవల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకు ఆరోగ్య శాఖ కార్యదర్శి స్పందిస్తూ నగరంలోని 36 ఆస్పత్రులు ఎంతో బాగా సేవలందిస్తున్నాయన్నారు. తరచూ వీటిని తనిఖీ చేసేందుకుగాను ఎనిమిది బృందాలను నియమించామన్నారు. డిస్పెన్సరీలను సైతం తరచూ తాము తనిఖీ చేస్తున్నామన్నారు. ఔట్ పేషంట్ విభాగాల (ఓపీడీ) వద్ద రోగులు బారులు తీరే పరిస్థితి రాకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా మందుల కొరత సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.