ఢిల్లీ అసెంబ్లీ రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన రాజకీయాలపై ఎనిమిది నెలల నిరీక్షణకు తెరపడింది. ఢిల్లీ శాసనసభను రద్దు చేయాలని సిఫారసు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ మంగళవారం ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఢిల్లీలో తిరిగి ఎన్నికల నిర్వహణకు ఇక లాంఛనంగా రాష్ట్రపతి ఆమోదించటమే మిగిలింది.
నివేదికను కేంద్రానికి పంపిన రాష్ట్రపతి
ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో సోమవారం చర్చించిన అనంతరం మూడు పార్టీలు విముఖత వ్యక్తం చేయటంతో అసెంబ్లీని రద్దు చేయాలని నజీబ్‌జంగ్ సిఫారసు చేశారు. మైనార్టీ సర్కారు ఏర్పాటుపై విముఖంగా ఉన్న కమలనాథులు ఎన్నికలను ఎదుర్కొనేందుకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో నజీబ్ జంగ్ మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదిక సమర్పించారు. తగినంత సంఖ్యా బలం లేనందువల్ల ప్రభుతాన్ని ఏర్పాటు చేయలేమని మూడు పార్టీలు తెలిపాయని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను రాష్ట్రపతి వెంటనే కేంద్రానికి పంపారు. దీని ఆధారంగా ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలనే ప్రతిపాదనను హోంశాఖ కేబినెట్ ముందుంచింది. సాధారణంగా బుధవారం సమావేశమయ్యే కేబినెట్ తాజా పరిణామాలతో మంగళవారం ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశమై అసెంబ్లీ రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
సంపూర్ణ మెజార్టీ సాధిస్తాం: కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు తలొగ్గి బీజేపీ ముందుగానే ఓడిపోయిందని ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నాలుగు నెలల నుంచి అవినీతి, అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో బీజేపీ దిగి వచ్చిందన్నారు. 49 రోజుల తమ పాలనలో ఢిల్లీలో జరిగిన అభివృద్ధి పనులు, ప్రపంచంలో ఉత్తమ నగరంగా తీర్చిదిద్దడం, అవినీతి నుంచి విముక్తి కల్పించడం ప్రచార అంశాలుగా చేసుకుని ప్రజల్లోకి వెళతామన్నారు. తాను న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పిన కేజ్రీవాల్ తుది నిర్ణయం పార్టీదేనన్నారు. ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆప్‌కు సంపూర్ణ మెజార్టీ కట్టబెడతారని విశ్వాసం వెలిబుచ్చారు.
కాగా, అసెంబ్లీని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయమే తీసుకున్నారని కాంగ్రెస్ పేర్కొంది.
డిసెంబర్‌లోనా వచ్చే ఏడాదా?
ఢిల్లీలో తిరిగి ఎప్పుడు ఎన్నికలు జరిపించాలన్న విషయంపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఢిల్లీలో మూడు అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను కూడా రద్దు చేయనున్నారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున డిసెంబర్ నెలాఖరులో ఆఖరి దశలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని కొందరు అంటుండగా, జనవరిలో లేదా ఫిబ్రవరిలో హస్తిన ఎన్నికలు ఉంటాయని మరికొందరు భావిస్తున్నారు. ఢిల్లీలో గత ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. 49 రోజుల పాలన తరువాత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజీనామా చేయటంతో రాష్ట్రపతి పాలన విధించి అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచారు.