'మోదీ రాజీనామా చేయొద్దన్నారు'
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి నజీబ్ జంగ్ శుక్రవారం రాజీనామా చేశారు. గవర్నర్ పదవికి జంగ్ రాజీనామా చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, గతంలోనే రెండుసార్లు పదవికి రాజీనామా చేయగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను పదవిలో కొనసాగాలని కోరారని జంగ్ పేర్కొన్నారు. సొంత కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నానని, తన మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని తెలిపారు.
తన తల్లికి 95 ఏళ్లని.. ఆమెతో పాటు తనయులు వారి పిల్లలకు సమయం కేటాయించాలని అందుకే పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. గవర్నర్ పదవిలో ఉంటూ సెలవులు తీసుకోవడం సరికాదని అన్నారు. 2014 మేలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలుత రాజీనామా ప్రపోజల్ ను కేంద్రం ముందు ఉంచానని, ఆ తర్వాత 2016లో రెండో సారి రాజీనామాను ఆమోదించాలని కోరగా మోదీ తనను కొనసాగాలని కోరారని చెప్పారు. మంగళవారం రాజీనామా చేస్తానని మళ్లీ కోరగా మోదీ అందుకు అంగీకరించినట్లు చెప్పారు.