
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ హర్‌సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి చేసిన రాజీనామా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కుదిపివేసిందని శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ అన్నారు. వ్యవసాయ బిల్లులకు నిరసనగా పంజాబ్‌లోని ముక్త్సర్‌లో శుక్రవారం జరిగిన ర్యాలీలో బాదల్ మాట్లాడుతూ గత రెండు నెలలుగా రైతుల గురించి ఎవరూ నోరెత్తలేదని, హర్‌సిమ్రత్ రాజీనామాతో రోజూ ఐదుగురు మంత్రులు ఈ అంశంపై మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అణు బాంబుతో జపాన్‌ను కుదిపివేస్తే అకాలీదళ్ వేసిన ఒక బాంబుతో (హర్‌సిమ్రత్ రాజీనామా) మోదీ ప్రభుత్వం వణికిపోతోందని చెప్పారు. చదవండి : రోడ్డెక్కిన రైతన్న.. రహదారుల దిగ్భందం
ఇక వ్యవసాయ బిల్లులకు నిరసనగా పంజాబ్‌లో ఎస్‌ఏడీ ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. మరోవైపు ఈ బిల్లులను అడ్డుకోవాలని ఎస్‌ఏడీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి అభ్యర్ధించింది. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎంపీ, సుఖ్బీర్ బాదల్ సతీమణి హర్‌సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ శుక్రవారం భారత్ బంద్‌కు పలు రైతు సంఘాలు పిలుపు ఇచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment