ఢిల్లీ కొత్త గవర్నర్ నియామకం!
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర కొత్త లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)గా అనిల్ బైజల్ నియామకం కానున్నట్లు సమాచారం అందింది. లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నజీబ్ జంగ్ ఈ నెల 22న పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, బుధవారం జంగ్ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జంగ్ స్ధానంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా జమ్మూ కశ్మీర్ గవర్నర్ పదవికి బైజల్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో బైజల్ కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.
గతంలోనే రెండుసార్లు పదవికి రాజీనామా చేయగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను పదవిలో కొనసాగాలని కోరారని జంగ్ చెప్పిన విషయం తెలిసిందే. సొంత కారణాలతోనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.