
భిన్నత్వంలో ఏకత్వమే మన బలం
68వ స్వాతంత్ర దినోత్సవంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్
సాక్షి, న్యూఢిల్లీ: భిన్నత్వంలో ఏకత్వమే మన బలమని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పేర్కొన్నారు. ఐకమత్యంతో ఉన్నందువల్లనే స్వాతంత్య్రం సాధించామని ఆయన చెప్పారు. 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్జీ...స్థానిక ఛత్రసాల్ స్టేడియంలో శుక్రవారం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకితభావం, చిత్తశుద్ధి, నిజాయితీతో సమాజ సంక్షేమానికి, దేశాభివృద్ధికి కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేయాల్సిందిగా నగర పౌరులకు ఆయన విజ్ఞప్తిచేశారు.
అంతకుముందు ఏసీపీ దీపక్ గౌరి, కంపెనీ కమాండర్ అభిషేక్ వర్మ నేతృత్వంలో ఢిల్లీ పోలీస్ పరేడ్‌ను వీక్షించారు. ఢిల్లీ పోలీసు, ఢిల్లీ హోం గార్డు, ఎన్‌సీసీ, సివిల్ డిఫెన్స్, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, స్కూలు విద్యార్ధుల బృందాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మురికినీటి గుంటలో మునిగిపోతున్న ముగ్గురిని కాపాడిన మాస్టర్ ఆశీశ్‌కు ఎల్జీ ఈ సందర్భంగా జీవన్ రక్షక్ పతకం బహుకరించారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతిపిత మహాత్మాగాంధీకి లెఫ్టినెంట్ గవర్నర్ నివాళులర్పించారు. గాంధీజీ స్వాతంత్య్రోద్యమానికికొత్త దిశ నిచ్చి దేశానికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించారని చెప్పారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో కూడినభారతదేశం గురించి గాంధీ ఆయన కలగన్నారన్నారు. గడిచిన 67 సంవత్సరాల కఠోర పరిశ్రమ ద్వారా ఈ కల చాలావరకు నెరవేరిందని, అయితే వేగంగా మారుతున్న ప్రపంచం కొత్త కొత్త సవాళ్లను మన ముందుంచుతోందని చెప్పారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ మనం ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
కీలకపాత్ర పోషించాలి
దేశ స్వాతంత్య్రోద్యోమంలో నగరంకీలక పాత్ర పోషించిందని, నేడుకూడా ఢిల్లీవాసులకు నగర, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని ఎల్జీ సూచించారు. ఢిల్లీని మరింత అందంగా, సవృద్ధిమయంగా తీర్చిదిద్దుతామన్నారు. నగరవాసుల సంక్షేమం, అభివృద్ధికి ఢిల్లీ ప్రభుత్వం కట్టుబడి ఉందని జంగ్ చెప్పారు. తలసరి ఆదాయంలో ఢిల్లీ దేశంలోనే అగ్రస్థానంలోనే ఉందని, ఢిల్లీ రాష్ట్ర ఆదాయం జాతీయ ఆదాయానికి రెట్టింపని ఆయన చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల ముఖ్యంగా బలహీన వర్గాల ప్రగతిని కాంక్షిస్తోందని ఢిల్లీ బడ్జెట్‌లో 67 శాతాన్ని సాంఘిక సంక్షేమం కోసమే కేటాయించామని జంగ్ తెలిపారు.
పరిశుభ్రంగా ఢిల్లీ
ఢిల్లీని పచ్చగా పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. నగరంలో అటవీప్రాంతం 3.61 శాతంమేర పెరిగినట్టుఓ సర్వే వెల్లడించిందని తెలిపారు. ఢిల్లీలో 2,000 ఉద్యానవనాలు ఉన్నాయని చెప్పారు. 11 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన చెప్పారు. నగరాన్ని కాలుష్య ర హితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని, ప్రత్యామ్నాయ ఇంధనాన్ని వాడడాన్ని ప్రోత్సాహానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు ఆయన చెప్పారు. నగరంలోని విభిన్న ప్రాంతాలలో ఈ సంవత్సరంలో 9 సోలార్ యూనిట్లను ఏర్పాటు చేశామని, మరో 10 ప్లాంట్లను త్వరలో ఏర్పాటు చేస్తారని ఆయన చెప్పారు.
భద్రతతో కూడిన రవాణా సదుపాయం
ప్రజలకు చౌక, సౌఖ్యం, భద్రతతో కూడిన రవాణా సదుపాయాల్ని కల్పించడానికి ఢిల్లీ సర్కారు పనిచేస్తున్నదని ఎల్జీ పేర్కొన్నారు. కొత్తగా 1,380 శీతలేతర డీటీసీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. మహిళల కోసం 26 బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నామని తెలిపారు. ఢిల్లీలో 190 కి.మీ మెట్రో నెట్‌వర్క్ ఉందని, 103 కి.మీ మేర విస్తరిస్తున్న మూడవ దశలో 35 శాతం మేర పని పూర్తయిందని ఆయన చెప్పారు. బాలికలు, ఎస్సీఎస్టీలు, ఓబీసీలకు గ్రామాల్లో నివసించే యువతకు అనియత శిక్షణ ఇచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం పని చేస్తుందని, ఇందుకోసం నాలుగు ఐటీఐలను కొత్తగా ఏర్పాటు చేశామని జంగ్ చెప్పారు.
నాలుగు చోట్ల జలశుద్ధీకరణ కేంద్రాలు
ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులు జనన ధ్రువీకరణ పత్రాలను ఉచితంగా అందజేస్తున్నాయని చెప్పారు. యమునా నదికి మళ్లీ ప్రాణం పోయడానికి ప్రపంచం నలుమూలల్లోని నిపుణుల నుంచి సాంకేతిక సహాయం పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. పప్పన్‌కలాన్, నిలోఠి, యమునా విహార్ , ఢిల్లీ గేట్ల వద్ద జలశుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సింగ పూర్ ప్రభుత్వ సహాయంతో 40 ఎంజీడీల జలశుద్ధీకరణ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక ఉందన్నారు. మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రభుత్వం కృషిచేస్తుందని జంగ్ తెలిపారు. లైంగిక వేధింపు బాధితులకు వైద్య, న్యాయపరమైన సహాయం అందించడం కోసం ప్రతి జిల్లాలో వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. బిందాపుర్, లాంపుర్‌లలో వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేసినట్ల్లు ఆయన చెప్పారు.
వచ్చే ఏడాది ఏడు నైట్ షెల్టర్లు
మురికివాడల్లో నివసించేవారికి మరుగుదొడ్లు, పేదలకు గృహ వసతి కల్పనకు ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రయత్నిస్తోందని జంగ్ తెలిపారు. వచ్చే సంవత్సరం ఏడు నైట్ షెల్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. జాతీయ ఆహార భద్రతా పథకం కింద 36 లక్షల మంది ప్రయోజనం పొందారని, వృద్ధాప్య పింఛను లబ్ధిదారుల సంఖ్యను 3.90 లక్షల నుంచి 4.30 లక్షలకు పెంచారని ఆయన చెప్పారు. నగరానికి తాగునీరు అందించడం కోసం రేణుకా డ్యాం నిర్మాణాన్ని వేగిరపరిచామని తెలిపారు.
అవినీతిని అంతమొందించి, వ్యవస్థలను పారదర్శకంగా, జవాబుదారీగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఉల్లిపాయలు,బంగాళాదుంపలను సరసమైన ధరలకు వినియోగదారులకు అందించడం కోసం ప్రభుత్వం వాటిని సేకరించి విక్రయిస్తోందని, వాటిని అక్రమంగా నిల్వ చేయడాన్ని నిరోధించడం కోసం తనిఖీలు నిర్వహిస్తోందని, అక్రమ నిల్వలకు పాల్పడిన 300 మంది దుకాణదారులపై చర్య తీసుకుందని నజీబ్ జంగ్ వివరించారు.
భద్రతా విధుల్లో భారీగా బలగాలు
68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారీసంఖ్యలో భద్రతా బలగాలు విధుల్లో పాల్గొన్నాయి. ఢిల్లీ పోలీసు విభాగంతోపాటు పారామిలిటరీకి చెందిన 15 వేల మంది సిబ్బంది ఇందులో పాలుపంచుకున్నారు. ఎర్రకోట బురుజులపై అత్యధిక రిజల్యూషన్ కలిగిన సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ముంబై నుంచి నగరానికి వీటిని తెప్పించారు. వీటికి ఒకరోజు కిరాయి రూ. 50 వేలు.
జెండాను ఉల్టా ఎగురవేసిన మనీష్
సాక్షి, న్యూఢిల్లీ: పడ్పట్‌గంజ్ ఎమ్మెల్యే, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా జెండాను ఉల్టా ఎగురవేశారు. వెస్ట్ వినోద్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఎగరువేసిన జెండా తలకిందులైంది.ఆకుపచ్చ రంగు పైన, కాషాయ వర్ణం కిందకు ఉన్న జెండాను ఆయన ఎగురవేశారు. అయితే జెండా ఎగురవేసేంతవరకు తనకు దానిని తలకిందులుగా కట్టిన విషయం తెలియదని, జెండా ఆవిష్కరణ తరువాత ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చినవెంటనే పొరపాటును చక్కదిద్దానని మనీష్ సిసోడియా చెప్పారు.
ఇది తెలియకచేసిన పొరపాటేనని ఆయన చెప్పారు.అయితే అన్నీతెలిసి కూడా ఆయన ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి మరో పొరపాటు చేశారని పడ్పట్‌గంజ్ వాసులు అంటున్నారు. శుక్రవారం ఉదయం ఆయన తన నియోజకవర్గంలోని పలు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిసోడియాతో పలువురు ఆప్ కార్యకర్తలు హెల్మెట్ ధరించలేదని వారు అంటున్నారు. ఒకరిద్దరు కార్యకర్తల మోటారు సైకిళ్లపై హెల్మెట్లు కనిపించినా వారు వాటిని ధరించకుండా ఆమ్ ఆద్మీ టోపీలను ధరించారని ఫిర్యాదులొచ్చాయి. ఈ ర్యాలీ వల్ల ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురయ్యాయని కూడా వారు ఆరోపించారు.