ఎందరో పోరాటయోధుల త్యాగఫలం..
సాక్షి, స్కూల్ ఎడిషన్: ఎందరో త్యాగమూర్తులు తమ జీవితాలను పణంగా పెట్టి చేసిన పోరాట ఫలితంగా భారతీయులు నేడు స్వీచ్ఛా వాయువులు పీల్చగలుగుతున్నారు. భారత ఉపఖండంలో స్వాతంత్య్రం కోసం జరిగిన ఈ ఉద్యమాలన్నింటినీ కలిపి ‘భారత స్వాతంత్య్రోద్యమం’గా పిలుస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసా పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్య్ర పోరాటంలో భాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్ పాలనను అంతమొందించడానికి ఎవరికి నచ్చిన సిద్ధాంతాలతో వారు ఉద్యమించారు. ఈ రోజు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆనాటి పోరాటాలను ఒకసారి గుర్తుచేసుకుందాం..!
తొలి అడుగు
16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణలకు వ్యతిరేకంగా అబ్బక్కరాణి చేసిన పోరాటాలు, 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్‌లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై పోరాటానికి పడిన తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. మొదటి సాయుధ పోరాటం బెంగాల్‌లో ప్రారంభమై, తర్వాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్‌గా ఆవిర్భవించింది.
కీలకమార్పు.. సిపాయిల తిరుగుబాటు
కాంగ్రెస్‌లో అతివాదులైన లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ (లాల్ బాల్ పాల్).. విదేశీ వస్తు బహిష్కరణ, సమ్మె, స్వావలంబన వంటి పద్ధతులను అవలంభిస్తే, అరబిందో వంటివారు తీవ్రవాద మార్గాలను ఆశ్రయించారు. మొదటి దశ కాలంలో సాయుధ విప్లవ పోరాటాలు ముందుకొచ్చాయి. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాల్లోని భారత స్వాతంత్య్ర యోధులు ప్రారంభించిన గదర్ పార్టీ సహకారంతో జరిగిన భారత సిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో వచ్చిన కీలకమైన మార్పు.
తనదైన మార్గాన్ని ఎంచుకున్న గాంధీ
జాతీయోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్ మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గంలో ఉద్యమించింది. ప్రముఖ విద్యావేత్త రాంజీసింగ్.. మహాత్మాగాంధీని 20వ శతాబ్దంలో అవతరించిన బోధిసత్వునిగా కీర్తించారు. అయితే ఇతర నాయకులు మాత్రం సాయుధ పోరాటాలను కొనసాగించారు. సుభాష్ చంద్రబోస్ సాయుధ సంగ్రామమే సరైనదిగా భావిస్తే, మిగిలిన వారు సన్నకారు రైతులు, శ్రామికుల ఆర్థిక స్వాతంత్య్రానికై పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం నాటికి ఈ ఉద్యమాలు ఉధృత రూపం దాల్చాయి. నేతాజీ ఆజాద్ హింద్ ఫౌండేషన్ పేరుతో భారత జాతీయ సైన్యాన్ని స్థాపించి తూర్పు ఆసియా నుంచి పోరాడగా, భారత జాతీయ కాంగ్రెస్ ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి పిలుపునిచ్చింది.
అంతిమ విజయం
మహాత్మా గాంధీ నాయకత్వంలో 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్య్ర దేశంగా ఆవిర్భవించింది. 1950 నవంబర్ 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి, దేశాన్ని ‘సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్య్ర రాజ్యం’గా ఆవిర్భవింపచేసింది.