ఢిల్లీకి ఎనిమిది నెలల రాజకీయ అనిశ్చితి నుండి ఎట్టకేలకు విముక్తి లభించింది. ప్రధాన రాజకీయ పక్షాలు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు రెండూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అశక్తతను వ్యక్తం చేయడంతో అసెంబ్లీ రద్దుకు లెఫ్టినెంట్ గవర్నర్ నవాబ్ జంగ్ మంగళవారం సిఫార్సుచేశారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి నిరుడు డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షమైన అకాలీదళ్‌కు వచ్చిన ఒక స్థానాన్ని కలుపుకొని బీజేపీ 32 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆప్‌కు 28 స్థానాలు రాగా కాంగ్రెస్‌కు 8 లభించాయి. కొంత ఊగిసలాట తర్వాత అదే నెలలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైనా అది రెండు నెలలుకూడా మనుగడ సాధించలేకపోయింది. పదవినుంచి వైదొలగుతూ కేజ్రీవాల్ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశారు.
లెఫ్టినెంట్ గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించదల్చుకుంటే ఆ సిఫార్సును పట్టించుకుని ఉండేవారు. ఎందుకంటే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితిలో లేమని బీజేపీ ఆదిలోనే చెప్పింది. కేజ్రీవాల్ రాజీనామా అనంతరం మరోసారి దాన్నే పునరుద్ఘాటించింది. కనుక మళ్లీ ఎన్నికలు నిర్వహించడం తప్ప అక్కడ ప్రత్యామ్నాయం లేదు. మేలో జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలతోపాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తాయని అందరూ అంచనావేసిన సమయంలో రాష్ట్రపతి పాలన వచ్చిపడింది. ఆనాటి యూపీఏ సర్కారు అభీష్టార్థం నడుచుకున్న లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్ సిఫార్సును పక్కనబెట్టారు. కనుకనే కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.
రాజ్యాంగ నిబంధనలను పాటించడంలో అటు కార్యనిర్వాహకవర్గమూ, ఇటు రాజకీయ పక్షాలూ విఫలమవుతున్నాయి. ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంనుంచి ఆలోచించడంతప్ప నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్న స్పృహ కరువవుతున్నది. ఢిల్లీలో ఏర్పడ్డ రాజకీయ ప్రతిష్టంభనను తొలగించడానికి ఏం చేయదల్చుకున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు లెఫ్టినెంట్ గవర్నర్‌నూ, కేంద్ర ప్రభుత్వాన్నీ ఏడు నెలలక్రితం కోరినప్పుడు కొందరు నొచ్చుకున్నారు. ఇది కార్యానిర్వాహక వర్గం అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని అభిప్రాయపడ్డారు. కానీ, సుప్రీంకోర్టు వెంటపడింది గనుకే ఇంత ఆలస్యంగానైనా అసెంబ్లీ రద్దు విషయం తేలింది. ఈ కాలమంతా రాజకీయ పార్టీల పిల్లిమొగ్గల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి, దాన్ని నవాబ్‌జంగ్ అంగీకరించలేదని అలిగి సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లిన కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల అనంతరం కొంతకాలంపాటు వైఖరి మార్చుకున్నారు. రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు కొన్ని ప్రయత్నాలు చేశారు. అది సాధ్యపడేలా లేదని గ్రహించాక మళ్లీ అసెంబ్లీ రద్దు పాటపాడారు. బీజేపీ సైతం ఇలాంటి ఊగిసలాటనే ప్రదర్శించింది. ఈ ఊగిసలాట ఉద్దేశపూర్వకం కూడా కావొచ్చు. ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదు గనుక ప్రతిపక్షంలోనే కూర్చుంటామని అసెంబ్లీ ఎన్నికలైన వెంటనే స్పష్టంగా చెప్పిన ఆ పార్టీ కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పడగానే కొత్త ఆలోచనలు చేసింది.
అధికారికంగా ఏమీ చెప్పకపోయినా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుపై కొంత ప్రయత్నంచేసినట్టు కనబడింది. తమ పార్టీకున్న 31 మంది సభ్యుల్లో ముగ్గురు మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నికై బలం 29కి తగ్గడంతో ఈ విషయంలో చురుగ్గా కదల్లేకపోయింది. అందువల్లే ఖాళీ ఏర్పడిన మూడు అసెంబ్లీ స్థానాలకూ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఆ మూడు స్థానాలూ గెల్చుకున్నా ఫిరాయింపుల ద్వారా తప్ప ప్రభుత్వం ఏర్పాటుచేయడం అసాధ్యమని, అది పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తుందని చివరకు భావించింది. దాని పర్యవసానమే అసెంబ్లీ రద్దు నిర్ణయం. అయితే, ఈ ఎన్నికలు మొన్నటి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలతోగానీ...ఈ నెలలో జరగబోయే జమ్మూ-కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికలతోగానీ రాకుండా చూడటంలో విజయం సాధించింది. ఢిల్లీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కేంద్రీకరించడం కోసమే ఈ ఎత్తుగడవేసింది.
వాస్తవానికి ఢిల్లీలో బీజేపీకి నాయకత్వ సమస్య ఉంది. కనుకనే నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంస్థాగతంగా పటిష్టంగా ఉన్నా కాంగ్రెస్‌పై ఏర్పడిన అసంతృప్తిని తనకు అనుకూలంగా మలచుకోవడంలో విఫలమైంది. మోదీ రాకతో ఆ పరిస్థితి మారి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలనూ గెల్చుకోగలిగింది.
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు ఇచ్చిన ఊపుతో ఢిల్లీ అసెంబ్లీని కూడా చేజిక్కించుకోగలమన్న విశ్వాసం ఆ పార్టీలో ఉన్నా రాష్ట్ర స్థాయిలో అందరి విశ్వాసాన్నీ పొందగలిగిన ఒక నాయకుణ్ణి ముందుకు తీసుకురావడంలో బీజేపీ ఇంతవరకూ సఫలం కాలేదు. అయితే, కాంగ్రెస్ వరస అపజయాలతో కుదేలై ఉండటమూ, నిరుడు ఎన్నికల నాటికి అవినీతిని ప్రధానాస్త్రంగా చేసుకుని నైతికంగా దృఢంగా కనబడిన ఆప్ ఇప్పుడు మిగిలిన పార్టీల్లో ఒకటిగా మిగిలిపోవడమూ బీజేపీకి పనికొచ్చే అంశాలు. అయితే, ఢిల్లీలో ఇటీ వల జరిగిన కొన్ని పరిణామాలు ఆందోళన కలిగించేవి. రాజధాని నగరంలోని త్రిలోక్‌పురిలో మత ఘర్షణలు నెలకొనడమూ, తమ కాలనీల్లో మతపరమైన ఊరేగింపు జరపరాదంటూ నంద్‌నగ్‌రి, బవానాల్లో కొందరు తీర్మానాలు చేయడమూ పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. సామాన్య పౌరుల్లో భయాందోళనలు రేకెత్తించే ఇలాంటి ఉదంతాలను మొగ్గలోనే తుంచి, కారకులపై చర్య తీసుకోకపోతే ఎన్నికల వాతావరణం కలుషితమవుతుంది. అనవసర వైషమ్యాలు, ఉద్రిక్తతలు పెరుగుతాయి. రాజధాని నగరంగా ఉన్న ఢిల్లీలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం దేశ ప్రతిష్టను పెంచదు. కనుక అన్ని రాజకీయ పక్షాలూ ఎన్నికలు ఆగమిస్తున్న ఈ దశలో బాధ్యతాయుతంగా, అప్రమత్తతతో మెలగాలి. ప్రతి కాలనీలోనూ శాంతి కమిటీలు ఏర్పాటు చేసి సామాన్య పౌరులకు అండగా నిలిచి, శాంతియుత వాతావరణం ఏర్పడటానికి దోహదపడాలి.