
'ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాలేదు'
ఢిల్లీ: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగుమం కానుందా? తాజా పరిణామాలను చూస్తే అవుననక తప్పదు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఏ పార్టీ కూడా ఆసక్తి కనబరచకపోవడంతో అక్కడ ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితే కనిపిస్తోంది. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను సోమవారం కలిసిన పలు పార్టీ ల నేతలు ప్రభుత్వ ఏర్పాటు కంటే ఎన్నికల వైపే ఆసక్తి చూపారు. ఢిల్లీలో ఏ పార్టీ కూడా అధికారాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని నజీబ్ జంగ్ తాజాగా స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ, కాంగ్రెస్, ఆప్ లు తనకు తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఓ నివేదికను రాష్ట్రపతికి నజీబ్ జంగ్ పంపనున్నారు.
రాష్ట్రపతి పాలనలో ఉన్నఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రాజకీయ అనిశ్చితిని తొలగించాలని సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయాన్ని నజీబ్ కు స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించాలని నజీబ్ జంగ్ ను కోరారు. మైనార్టీ ప్రభుత్వాన్ని అయినా ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు సూచించడంతో అందరూ బీజేపీకి అవకాశం లభిస్తుందని అనుకున్నారు. ఆ దిశగా కమలదళం కూడా ప్రయత్నించింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఎన్నికలకే మొగ్గు పుతున్నట్లు తాజా పరిణామాల్ని బట్టి తెలుస్తోంది.