విపక్షాలకు షాక్ ఇచ్చి.. కోవింద్‌కు జై!
బీజేపీ ఊహించినట్టుగానే కొత్త రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాల్లో చీలిక వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రముఖ దళిత నేత అయిన రామ్‌నాథ్ కోవింద్‌ను బీజేపీ ప్రకటించడంతో విపక్షాల్లో తర్జనభర్జన మొదలైంది. కోవింద్‌కు మద్దతునివ్వాలా? లేక మరో అభ్యర్థిని నిలబెట్టాలా? అని విపక్షాలు మల్లగుల్లాలు పడుతుండగానే.. వాటికి షాక్ ఇస్తూ బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మంగళవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మిత్రపక్ష నేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఫోన్ చేసిన నితీశ్.. తాను రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఇచ్చే అవకాశమే ఎక్కువని చెప్పినట్టు సమాచారం. ఇన్నాళ్లు బిహార్ గవర్నర్‌గా పనిచేసిన కోవింద్‌తో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో కోవింద్‌ను కాదని విపక్ష అభ్యర్థికి అండగా నిలువలేనని ఆయన చెప్పినట్టు సమాచారం. బిహార్‌లోని నితీశ్ సంకీర్ణ ప్రభుత్వంలో లాలూ ఆర్జేడీ, కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్నాయి.
విపక్షాలను విస్మయంలో ముంచెత్తుతూ రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన వెంటనే కోవింద్‌ను నితీశ్ ప్రశంసల్లో ముంచెత్తారు. రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్‌ను నిలబెట్టడం వ్యక్తిగతంగా తనకు సంతోషాన్నిచ్చిందన్నారు. అంతేకాకుండా కోవింద్‌ను స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. మిగతా అన్ని అన్ని విషయాల్లో ప్రతిపక్షాలకు అండగా ఉంటానని, రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం తనను మినహాయించాలని నితీశ్ పేర్కొంటున్నట్టు సమాచారం.