గురువారం రాష్ట్రపతి ముర్ముకు నివేదిక అందజేస్తున్న కోవింద్, చిత్రంలో అమిత్ షా
లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి..
ఆ తర్వాత 100 రోజుల్లోగా స్థానిక సంస్థలకు..
కోవింద్ కమిటీ సిఫార్సులు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు నివేదిక సమరి్పంచిన కమిటీ
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమరి్పంచింది.
రామ్‌నాథ్ కోవింద్‌తోపాటు కమిటీ సభ్యులైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్.కె.సింగ్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కాశ్యప్, లోక్‌సభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ముర్మును నివేదిక అందజేశారు. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల ఈ నివేదికలో ఉన్నత స్థాయి కమిటీ కీలక సిఫార్సులు చేసింది.
రెండంచెల విధానాన్ని సూచించింది. తొలుత లోక్‌సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత 100 రోజుల్లోగా అన్ని రకాల స్థానిక సంస్థలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. జమిలి ఎన్నికలతో అభివృద్ధి వేగవంతం అవతుందని, దేశానికి మేలు జరుగుతుందని ఉద్ఘాటించింది. ఈ ఎన్నికల కోసం కోవింద్ కమిటీ రాజ్యాంగానికి మొత్తం 18 సవరణలు సూచించింది.
రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే....
రామ్‌నాథ్ కోవింద్ కమిటీని 2023 సెప్టెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ 191 రోజులపాటు విస్తృత పరిశోధన సాగించింది. భాగస్వామ్యపక్షాలు, నిపుణులతో సంప్రదింపులు జరిపింది. దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బెల్జియం తదితర దేశాల్లో అమల్లో ఉన్న జమిలి ఎన్నికల ప్రక్రియలను అధ్యయనం చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే కోవింద్ కమిటీ సిఫార్సుల చేసిందని అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఈ సిఫార్సుల ప్రకారం రాజ్యాంగానికి కనిష్ట సవరణలతో జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని పేర్కొన్నాయి.
32 పార్టీల మద్దతు
జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోవింద్ కమిటీ సేకరించింది. అభిప్రాయం చెప్పాలంటూ 62 పార్టీలకు సూచించగా, 47 పార్టీలు స్పందించాయి. ఇందులో 32 పార్టీలు జమిలికి జైకొట్టాయి. 15 పార్టీలు వ్యతిరేకించాయి. మిగిలిన 15 పార్టీలు స్పందించలేదు. బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఏఐఏడీఎంకే, బిజూ జనతాదళ్, మిజో నేషనల్ ఫ్రంట్, శివసేన, జనతాదళ్(యూ), శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలు మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, సీపీఎం, సీపీఐ, ఎంఐఎం, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, నాగా పీపుల్స్ ఫ్రంట్, సమాజ్‌వాదీ పార్టీ వంటివి వ్యతిరేకించాయి.
త్వరలో లా కమిషన్ నివేదిక
ఏకకాలంలో ఎన్నికలపై లా కమిషన్ త్వరలో తన నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. 2029 నుంచి జమిలి ఎన్నికలు ప్రారంభించాని లా కమిషన్ సిఫార్సు చేయబోతున్నట్లు సమాచారం. లోక్‌సభ, శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ సూచించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కోవింద్ కమిటీ సిఫార్సులు
► లోక్‌సభలో హంగ్, అవిశ్వాస తీర్మానం వంటి సందర్భాలు ఎదురైనప్పుడు మళ్లీ తాజాగా ఎన్నికలు నిర్వహించాలి. కొత్త సభను ఏర్పాటు చేయాలి.
► ఎన్నికలు జరిగి కొత్తగా కొలువుదీరిన లోక్‌సభ ఐదేళ్లు కొనసాగదు. అంతకంటే ముందున్న సభ గడువు ఎన్నాళ్లు మిగిలి ఉంటుందో అప్పటివరకు మాత్రమే కొత్త సభ మనుగడ సాగిస్తుంది.
► రాష్ట్రాల శాసనసభలు లోక్‌సభ కాల వ్యవధి ముగిసేవరకు(ముందుగా రద్దయితే తప్ప) పనిచేస్తాయి.
► జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 83(పార్లమెంట్ కాల వ్యవధి), ఆర్టికల్ 172(శాసనసభ కాల వ్యవధి)కు సవరణ చేయాలి.
► ఆర్టికల్ 83, ఆర్టికల్ 172కు సవరణ చేయడానికి రాష్ట్రాల అమోదం అవసరం లేదు.
► జమిలి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో సంప్రదించి ఒక ఉమ్మడి ఓటరు జాబితా, ఓటరు గుర్తింపు కార్డులు రూపొందించాలి. ఇందుకోసం ఆర్టికల్ 325కి సవరణ చేయాల్సి ఉంటుంది.
► స్థానిక సంస్థలతో ఏకకాలంలో ఎన్నికల కోసం ఆర్టికల్ 324ఏను సవరించాలి.
► ఆర్టికల్ 325, ఆర్టికల్ 324ఏకు సవరణ చేయాలంటే రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి.
► ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిఏటా ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతోంది. విలువైన సమయం వృథా అవుతోంది. జమిలి ఎన్నికలతో ఇలాంటి సమస్యలు పరిష్కరించవచ్చు.
► జమిలి ఎన్నికల కోసం ప్రభుత్వం ఒక పటిష్టమైన చట్టబద్ధ యంత్రాంగాన్ని రూపొందించాలి.
Comments
Please login to add a commentAdd a comment