
ఆ అర్హత కేజ్రీవాల్ కు లేదు!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిపై బీజేపీ మండిపడింది. ఢిల్లీలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీని విమర్శిస్తున్న కేజ్రీవాల్ ఆ నైతిక హక్కును ఎప్పుడో కోల్పోయాడని బీజేపీ సెక్రటరీ శ్రీకాంత్ శర్మ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 49 రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన కేజ్రీవాల్.. ఇప్పుడు తమ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. ప్రజలు ఇచ్చిన ఒక అవకాశాన్ని కాలదన్నుకున్న ఆప్ నాయకుడు.. తాజాగా ప్రభుత్వ ఏర్పాటుపై కల్లిబొల్లి మాటలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను విమర్శించిన కేజ్రీవాల్ తీరును శ్రీకాంత్ తప్పుబట్టారు. నజీబ్ జంగ్ పై కేజ్రీవాల్ వ్యాఖ్యలను దురదృష్టకర, బాధ్యతారాహిత్యమైనవిగా ఆయన అభివర్ణించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ విమర్శించిన కేజ్రీవాల్.. తరువాత అదే పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మిగతా పార్టీల గురించి మాట్లాడే ముందు పార్టీలోని అవినీతి అంశాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.