న్యూఢిల్లీ:ఢిల్లీలో నూతన ప్రభుత్వ ఏర్పాటు అంశానికి సంబంధించి బీజేపీ నేతలు అత్యవసర సమావేశమైయ్యారు. తాజాగా బీజేపీని నూతన ప్రభుత్వ ఏర్పాటు అంశంతో పాటు, ఆప్ నేతలు విడుదల చేసిన వీడియో కూడా కలవరం పెడుతోంది. దీంతో బీజేపీ నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఒకవేళ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నుంచి ప్రభుత్వ ఏర్పాటుపై ఆహ్వానం అందిందే ఏం చేయాలన్న దానిపై ఆ భేటీలో ప్రధానంగా చర్చించారు.
ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ జిల్లాల అధ్యక్షులతో సమావేశమై పార్టీ పటిష్టతపై చర్చించారు. అంతకుముందు ఢిల్లీలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన నేపథ్యంలో ఆ అంశంపై కూడా చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ అవకాశం ఉన్నా.. ఒకవేళ ఎన్నికలు వస్తే ఏరకంగా ముందుకు వెళ్లాలనే అంశంపై జిల్లా అధ్యక్షులను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 28 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. ముగ్గురు బీజేపీ సభ్యులు పార్లమెంట్ కు వెళ్లడంతో 31 సీట్లతో ఉన్న పార్టీ 28కు పరిమితమైంది. అయితే ఆప్ నుంచి ఒక నేత బహిష్కరణ గురైన అనంతరం ఆ పార్టీ 27 సభ్యులతో తర్వాతి స్థానంలో ఉంది.