
గుజరాత్‌లో ఢిల్లీ ‘మకాం’..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటు ప్రభావం ఢిల్లీపై పడింది. నిన్నటివరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోడీ, నేడు ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించగానే ఢిల్లీ సర్కార్ గుజరాత్ బాటలో పయనించేందుకు సన్నద్ధమైంది. ఇటీవల పీఎం మోడీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య జరిగిన భేటీలో ఢిల్లీ నగరం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఢిల్లీలో గుజరాత్ తరహా అభివృద్ధికి గల అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఈ చర్చల ఫలితం.. గుజరాత్‌లో విజయవంతమైన ప్రాజెక్టుల అధ్యయనం కోసం ఢిల్లీ సర్కారుకు చెందిన పలు విభాగాల అధికారులతో కూడిన మూడు బృందాలు గురు, శుక్రవారాల్లో గుజరాత్‌లో పర్యటించాయి. ఇవి ముఖ్యంగా సౌరశక్తి ద్వారా విద్యుత్తు ఉత్పాదన , సీసీటీవీ కెమెరాలతో నగర నిఘా వ్యవస్థ, సబర్మతీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులను సందర్శించాయి.
గాంధీనగర్‌లో సౌరశశక్తి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే రెంట్ ఏ రూఫ్ ప్రాజెక్టును అధ్యయనం చేయడం కోసం ఢిల్లీ అధికారుల బృందం గాంధీనగర్‌లో రెండు రోజులు గడిపింది. విద్యుత్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పర్యావరణం అడవులు విభాగం కార్యదర్శి, ఐఅండ్ ఎఫ్‌సీ కార్యదర్శి, డీఈఆర్‌సీ, ఢిల్లీ ట్రాన్స్‌కో, ఎన్‌డీఎంసీతో పాటు ఎనర్జీ ఎఫీషియెన్సీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సెంటర్‌కు చెందిన అధికారులతో కూడిన బృందం పలు కోణాల్లో అధ్యయనం జరిపింది. రెంట్ ఏ రూఫ్ ప్రాజెక్టు కింద గాంధీనగర్ వాసులు తమ ఇంటి కప్పులను ప్రైవేటు విద్యుత్తు కంపెనీలకు అద్దెకు ఇస్తున్నారు. ఇంటికప్పులపై సౌరవిద్యుత్తును ఉత్పత్తి చేసే ఈ కంపెనీలు తాము ఉత్పత్తి చేసే ప్రతి యూనిట్ విద్యుత్తుకు రూ. 3 ఇంటికప్పును అద్దెకిచ్చిన వారికి చెల్లిస్తున్నాయి. స్కూళ్లు, ఆస్పత్రుల వంటి ప్రభుత్వ భవనాలను కూడా ఈ ప్రాజెక్టు కోసం వినియోగించుకుంటున్నారు.
సీసీటీవీ కెమెరాలతో సూరత్ నగరంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేసిన తీరును అధ్యయనం చేయడం కోసం ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులతో కూడిన బృందం సూరత్‌ను సందర్శించింది. సూరత్‌లోని కీలక ప్రదేశాల్లో అమర్చిన 104 సీసీటీవీ కెమెరాలతో ఆ నగరంలో నిఘావ్యవస్థను రూపొందించారు. రాత్రి వేళ కూడా పనిచేసే ఈ కెమెరాల నిర్వహణను అధ్యయనం చేసిన బృందంలో స్పెషల్ కమిషనర్ (ఆపరేషన్స్) సుందరీ నందా, ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ అనిల్ శుక్లా, డిప్యూటీ కమిషనర్ ( కమ్యూనికేషన్స్) నావేద్ ముంతాజ్ ఉన్నారు.
అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అమలుచేస్తోన్న సబర్మతీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును అధ్యయనం చేయడం కోసం 13 మందితో కూడిన బృందం అహ్మదాబాద్‌లో పర్యటించింది. సబర్మతీ నది తరహాలో యుమనా నదీ తీరాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ బృందం అధ్యయనం చేసింది. పర్యావరణం, అడవుల శాఖ కార్యదర్శి సంజీవ్‌కుమార్ ఈ అధ్యయనంపై నివేదిక సమర్పిస్తారు. అయితే, గుజరాత్ ప్రాజెక్టులను అధ్యయనం చేయడం కోసం లెప్టినెంట్ గవర్నర్ అధికారుల బృందాలను పంపడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది.
విద్యుత్తు కోతలు, నీటి సరఫరా సమస్యలతో నగరవాసులు సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో ముఖ్య అధికారులను పర్యటనలకు పంపించడం సమంజసం కాదని ఆప్ అభిప్రాయపడింది. ఈ అధ్యయనాలవల్ల గుజరాత్ ప్రభుత్వానికి ప్రచారం కల్పించినట్లవుతుందే తప్ప ఢిల్లీవాసులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని ఆప్ విమర్శించింది.