ఢిల్లీలో అభినందన కార్యక్రమంలో మోదీ, అమిత్‌షా అభివాదం
న్యూఢిల్లీ: అధికార దాహంతో కాంగ్రెస్ గుజరాత్‌లో కులతత్వాన్ని వ్యాప్తి చేయాలనుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన సంస్కరణలకు ప్రజామోదం ఉందనడానికి తాజా ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆయన అన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మోదీ కార్యకర్తలను ఉద్దేశించి సోమవారం ప్రసంగించారు. గత కొన్నాళ్లుగా గుజరాత్‌లో కులాల ఆధారంగా ఉద్యమాలు జరుగుతున్న వేళ... ఆ రాష్ట్రంలో సామాజిక సామరస్యం విలసిల్లాలనీ, అన్ని వర్గాల ప్రజలు గొడవల్లేకుండా ప్రశాంతంగా జీవించాలని మోదీ ఆకాంక్షించారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టాక అభివృద్ధికి అవసరమైన వాతావరణాన్ని నెలకొల్పామనీ, దానిని ఎవరూ పాడు చేయకూడదని ఆయన కోరారు. బీజేపీ గుజరాత్‌లో వరసగా ఆరోసారి గెలిచినా
ఈసారి గత రెండు దశాబ్దాల్లోనే అత్యల్ప స్థానాలను కైవసం చేసుకున్న నేపథ్యంలో... ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవని అన్నారు. తాను ప్రధాన మంత్రి అయ్యాక రాష్ట్రంలో తమ పార్టీ నాయకత్వాన్ని భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నాలు జరిగాయని మోదీ ఆరోపించారు. బీజేపీని ఓడించేందుకు విశ్వప్రయత్నాలు జరిగాయనీ, అన్ని రకాల కుట్రలను పన్నారని మోదీ దుయ్యబట్టారు. 30 ఏళ్ల క్రితం రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించిన రోజుల్లో కులతత్వం అనే విషం బాగా ఎక్కిందనీ, బీజేపీ ప్రభుత్వాలు, నేతలు దానిని నిర్మూలించేందుకు పనిచేశారని మోదీ అన్నారు. ఇప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా దేశం మంచి గుర్తింపు పొందాలంటే అభివృద్ధిలో కొత్త శిఖరాలను అందుకోవాల్సి ఉందనీ, ప్రజల సమస్యలకు అదే పరిష్కారమని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ తప్పుడు పనులకు వ్యతిరేకంగా, అభివృద్ధికి అనుకూలంగానే ప్రజలు ఓటేశారని మోదీ పేర్కొన్నారు. తన ప్రసంగం చివర్లో మోదీ ‘ఎవరు గెలుస్తారు’ అని ప్రశ్నించగా అభివృద్ధి గెలుస్తుంది అని కార్యకర్తలంతా ముక్తకంఠంతో జవాబిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment