ఒక హత్య...అనేక ప్రశ్నలు
అవినీతిని అంతమొందిస్తామంటున్న పాలకుల డొల్లతనాన్ని వెల్లడించే సందర్భమిది. నేరం, రాజకీయం, వ్యాపారం ఎంతగా పెనవేసుకుపోయాయో రుజువు చేసే ఉదంతమిది. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్‌డీఎంసీ) ఎస్టేట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎం.ఎం. ఖాన్‌ను గత నెల 16న ‘గుర్తు తెలియని దుండగులు’ కాల్చి చంపారు. ఇప్పుడా ఉదంతం తిరుగుతున్న మలుపులు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఎం.ఎం. ఖాన్‌కు నిజాయితీపరుడైన అధికారిగా పేరుప్రతిష్టలు న్నాయి. ముక్కుసూటిగా పోయే వ్యక్తి అన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. అలాంటి అధికారిని ఎవరు పొట్టనబెట్టుకున్నారన్న అంశంపై దర్యాప్తు మొదలై ఆ ఉదంతం జరిగిన అయిదురోజుల తర్వాత నగరంలోని హోటల్ యజమాని రమేష్ కక్కడ్ అరెస్టయ్యాడు. మరో ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అందుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుండగానే వెల్లడవుతున్న అంశాలు మన ప్రభుత్వాల, ప్రజాప్రతినిధుల పనితీరును ప్రశ్నించేవిగా ఉన్నాయి.
నిజాయితీపరుడని భావించే ఖాన్‌పై...ఆయన హత్యకు ముందు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు మూడు ఫిర్యాదులందితే ఆ మూడింటిలో ఒకటి నిందితుడైన హోటల్ యజమాని రాసింది. రెండో ఫిర్యాదు స్థానిక బీజేపీ ఎంపీ మహేష్ గిరినుంచి రాగా మూడోది ఎన్‌డీఎంసీ వైస్ చైర్మన్, బీజేపీ నేత కరణ్‌సింగ్ తన్వర్ రాశారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఖాన్‌పై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోమంటూ నజీబ్ ఎన్‌డీఎంసీకి రెండు లేఖలు రాశారు. ఇందులో ఒక లేఖను ఖాన్ హత్యకు అయిదు రోజుల ముందు పంపగా... రెండోది ఖాన్ హత్య జరిగిన మర్నాడు పంపారు. హోటల్ యజమాని ఫిర్యాదు చేయడాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే రూ. 140 కోట్ల లెసైన్స్ ఫీజు ఎగ్గొట్టిన కారణంగా నిరుడు ఫిబ్రవరిలో మూతబడ్డ హోటల్ విషయంలో జరుపుతున్న విచారణలో ఖాన్ తనకు అనుకూ లమైన నిర్ణయాన్ని ప్రకటిస్తారన్న నమ్మకం అతనికి లేదు.
అందుకే ఆయన ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని జంగ్‌కు ఫిర్యాదు చేశాడు. చర్య తీసుకోమని కోరాడు. కానీ స్థానిక బీజేపీ ఎంపీ, ఎన్‌డీఎంసీ వైస్ చైర్మన్‌లు ఇదే కేసుపై లేఖలు రాయా ల్సిన అవసరమేమిటి? ఈ లేఖలు కూడా ఖాన్ ‘ఏకపక్షంగా... అన్యాయంగా’ వ్యవహరిస్తున్న తీరుపైనే ఫిర్యాదు చేశాయి. హోటల్ యాజమాన్యం ఈ వివాదం గురించి చెబుతున్నదేమిటో విని తుది నిర్ణయం తీసుకోమని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఖాన్ పట్టించుకోవడం లేదన్నాయి. వారు లేఖలు రాస్తే రాశారు... నిజా నిజాలేమిటో నిర్ధారించుకోకుండానే వాటిపై చర్య తీసుకోవాలని ఎన్‌డీఎంసీకి జంగ్ ఎలా సిఫార్సు చేస్తారు? సిఫార్సు చేస్తే చేశారు... కనీసం తనకొచ్చిన ఫిర్యాదుకు కేంద్రబిందువైన అధికారి ముందురోజే హత్యకు గురయ్యారన్న కనీస స్పృహ కూడా లేకుండా పోవడమేమిటి?
జంగ్ రాసిన లేఖలు రెండూ ఖాన్ హత్యలో ఆయన ప్రమేయంపై అనుమా నాలు రేకెత్తిస్తున్నాయని, కనుక ఆయననూ... హోటల్ యజమానికి వకాల్తా తీసుకుని ఫిర్యాదులిచ్చిన ఇద్దరు నేతలనూ అరెస్టు చేయాలని ఢిల్లీ పాలకపక్షం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కోరుతోంది. జంగ్‌కూ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కూ మధ్య సంబంధాలు మొదటినుంచీ అంతంతమాత్రమే గనుక ఆ డిమాండ్‌లోని అంతరార్ధం తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ ప్రజా ప్రతినిధులుగా ఉంటున్న వారు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం లేదా? ఖాన్ గురించి ఫిర్యాదు వస్తే దాని ఆధారంగా తన కార్యాలయం ఒక లేఖ రూపొందించి నజీబ్ జంగ్‌కు పంపిందని, ఇంతకుమించి తనకేమీ తెలియదని ఎంపీ మహేష్ గిరి చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులుగా తమకెన్నో లేఖలు వస్తుంటాయని, స్పందించాల్సిన బాధ్యత తమకున్నదని కూడా అంటున్నారు.
ఈ జవాబు వింటే కొన్ని నెలల క్రితం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఉదంతం విషయంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వ్యవహరించిన తీరు గుర్తుకొస్తుంది. విశ్వవిద్యాలయంలో జాతి వ్యతిరేకులున్నారని తనకు ఫిర్యాదు అందితే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు లేఖ రాశానని ఆయన చేతులు దులుపుకుంటే... ఒక ప్రజా ప్రతినిధి నుంచి వచ్చిన లేఖను పరిశీలించి చర్య తీసుకోమని విశ్వవిద్యాలయాన్ని కోరామని ఆ శాఖ చెప్పింది. వచ్చిన ఫిర్యాదులోని నిజా నిజాలేమిటో ప్రాథమికంగా అయినా నిర్ధారించుకోలేని అశక్తులుగా తాము ఉన్నప్పుడు చర్య కోరుతూ లేఖలు రాసే బాధ్యతను నెత్తినేసుకోవడం సబబు కాదని వారికి ఎందుకు అనిపించడంలేదో ఆశ్చర్యకరం.
ఖాన్ హత్య విషయంలో తనపై ఆప్ చేస్తున్న ఆరోపణలను తోసి పుచ్చ డంతోపాటు ఈ విషాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీ వాడు కుంటున్నదని నజీబ్ జంగ్ అంటున్నారు. పైగా ఖాన్‌ను అమరుడిగా గుర్తించి, ఆయన కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలన్న కేజ్రీవాల్ ప్రభుత్వ సిఫార్సును తాను సత్వరం అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. చనిపోయాక నిర్వహించిన కర్మకాండలనూ, వారసులకు అందజేసిన డబ్బునూ ఏకరువు పెట్టి చిత్తశుద్ధిని చాటుకోవడానికి ప్రయత్నించడం కంటే ఈ ఉదంతంలో తాను వ్యవహరించిన తీరుపై ఆయన ఆత్మ పరిశీలన చేసుకుని ఉంటే సబబుగా ఉండేది. ఖాన్ విషయంలో వచ్చిన ఫిర్యాదులకు మూల కారణమైన హోటల్ కేసేమిటో ముందుగా తెలుసుకుని ఉంటే ఆయనకు చాలా విషయాలు అవగాహనకొచ్చేవి. ఇలాంటి కేసులో తన జోక్యం మంచిది కాదన్న సంగతి అర్ధమయ్యేది.
నాలుగైదు రోజులు ఆగితే ఖాన్ నివేదిక వచ్చేది. దాన్ని పరిశీలించి లోటుపాట్లుంటే ఆయనను నిలదీయడానికి, అవసరమైతే ఆయనపై చర్య తీసుకోవడానికి ఎటూ నజీబ్ జంగ్‌కు అధికారం ఉంటుంది. ఆ పని చేయకుండా... తనకొచ్చిన ఫిర్యాదులపై అంత తొందరపాటును ప్రదర్శించడం దేనికి సంకేతం? సామాన్య పౌరులు చేసే ఫిర్యాదుల విషయంలో ఇంత వేగిరం చర్య తీసు కుంటున్నారా? ఇంత యాంత్రికంగానూ వ్యవహరిస్తున్నారా? దీన్ని పాలన అంటారా...అరాచకమంటారా? జంగ్ సంజాయిషీ ఇవ్వాలి. కనీసం ఈ ఉదంతం తర్వాతైనా తమ పోకడల్ని మార్చుకోవలసిన అవసరాన్ని ప్రజా ప్రతినిధులంతా గుర్తించాలి.