స్మార్ట్ ఐడియా..!పూచ్-ఓ..! | najeeb jung starts the puch-o application | Sakshi
Sakshi News home page

స్మార్ట్ ఐడియా..!పూచ్-ఓ..!

Published Fri, Jul 11 2014 11:57 PM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

స్మార్ట్ ఐడియా..!పూచ్-ఓ..! - Sakshi

స్మార్ట్ ఐడియా..!పూచ్-ఓ..!

న్యూఢిల్లీ: ఆటో... ఆటో... అంటూ రోడ్డెక్కి ఇకపై అరవాల్సిన అవసరం లేదు. ఆటోలో ఎక్కిన తర్వాత ఆటోడ్రైవర్ తనను ఎక్కడికి తీసుకెళ్తున్నాడోననే బెంగ అసలే అక్కరలేదు. మీకు ఎప్పుడు, ఎక్కడికి వెళ్లేందుకు ఆటో కావాలో నిర్ణయించుకొని, స్మార్ట్‌ఫోన్‌లో ఓ మాట చెబితే చాలు.. మీరనుకున్న సమయానికి మీ ఇంటిముందుకు ఆటో వచ్చి వాలుతుంది.

పైగా అతను మిమ్మల్ని ఏ మార్గం ద్వారా గమ్యస్థానానికి తీసుకెళ్తున్నాడు..? ఆ క్షణంలో మీరు ఎక్కడున్నారనే విషయం కూడా మీ ఇంట్లో వారికి స్మార్ట్‌ఫోన్ చెప్పేస్తుంది. ఇదంతా ఎలా సాధ్యం? అనే ప్రశ్న అడిగేముందు ఇది చదవండి... ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ‘పూచ్-ఓ’ పేరుతో ఓ అప్లికేషన్(యాప్)ను శుక్రవారం ప్రారంభించారు.
 
స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే.. కావాల్సినప్పుడు ఆటోను బుక్ చేసుకోవచ్చు. ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్(డీఐఎంటీఎస్) ఈ అప్లికేషన్‌ను అభివృద్ధిపర్చింది. జీపీఎస్ సదుపాయం ఉన్న ఆటోలను ఈ అప్లికేషన్ ద్వారా బుక్‌చేసుకునే సౌకర్యముంది. మనకు సమీపంలో ఉన్న ఆటో ఏది? దాని డ్రైవర్ ఎవరు? అతని ఫోన్ నెంబర్ వంటి వివరాలు క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. వెంటనే ఆ డ్రైవర్‌కు కాల్ చేసి మనముంటున్న ప్రాంతానికి రమ్మని చెప్పవచ్చు. అయితే ఇందుకోసం డ్రైవ ర్లు డీఐఎంటీస్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
 
అప్లికేషన్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
ఆండ్రాయిడ్ సదుపాయం ఉన్న అన్ని ఫోన్లలో ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్లి సెర్చ్ బాక్స్ లో పీఓఓసీహెచ్-ఓ అని టైప్ చేస్తేచాలు అప్లికేషన్ ప్రత్యక్షమవుతుంది. ఇన్‌స్టాల్ బాక్స్‌పై క్లిచ్ చేస్తే అప్లికేషన్ డౌన్‌లోడ్ అయినట్లే.
 
భద్రం.. సౌకర్యవంతం: జంగ్
పూచ్-ఓ అప్లికేషన్ నగరవాసులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండడమేగాకుండా మహిళలకు భద్రతపై భరోసా కల్పించేదిగా ఉంటుందని గవర్నర్ నజీబ్ జంగ్ అన్నారు. రాత్రి సమయాల్లో ఆటో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు తాము ప్రయాణిస్తున్న ఆటో వివరాలను ఫేస్‌బుక్, ట్విటర్ వంటి  వెబ్‌సైట్లలో షేర్ చేసుకునే సదుపాయం కూడా ఉందన్నారు. దీనిద్వారా ప్రయాణిస్తున్నవారు ఎక్కడ ఉన్నారనే విషయం స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలుస్తుందన్నారు. ప్రయాణిస్తున్న దూరం, ఆటోవాలాలు వసూలు చేస్తున్న చార్జీల వివరాలు కూడా ప్రయాణికులకు తెలిసిపోతాయని, తద్వారా ఎటువంటి అవకతవకలకు అవకాశముండదని చెప్పారు. త్వరలో ఐఫోన్‌లో కూడా ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకునేలా మార్పులు చేయనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement