న‘గరం’
- ప్రతాపం చూపిస్తున్న సూర్యుడు
- రాజధానిలో పెరిగిన ఉష్ణోగ్రతలు
- బుధవారానికి 43 డిగ్రీలకు చేరుకున్న గరిష్ట ఉష్ణోగ్రత
- జాగ్రత్తలు తప్పనిసరని హెచ్చరిస్తున్న వైద్యులు
సాక్షి, న్యూఢిల్లీ: రాజధానిలో భానుడి భగభగలు మొదలయ్యాయి. రోజురోజుకి సూర్యుడు తన ప్రతాపాన్ని పెంచుతున్నాడు. ఉదయం పది గం టలకే ఎండ తీవ్రత అధికమవుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో నగరవాసులు సతమతమవుతున్నారు. ఈ వారాంతానికి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు చేరుకోగా, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదైంది. కాగా బుధవారం నమోదైన 43 డిగ్రీలు ఈ సీజన్‌లోనే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతగా వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఎండవేడిమికి తోడు వడగాలులు వీస్తుండడంతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. మధ్యాహ్న సమయంలో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ ఏడాది కాస్త ఆల స్యం గా మొదలైన వేసవి, కొద్ది రోజుల్లోనే తీవ్రరూపం దాల్చింది. అత్యవసర పనులు ఉన్నవారు మినహా మధ్యాహ్న సమయంలో బయటికి వచ్చేందుకు జనం ఇష్టపపడడం లేదు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున ప్రత్యేకించి వస్త్రధారణ, ఆహారపు అల వాట్లలో మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచి స్తున్నారు. ద్విచక్రవాహనాలను వాడేవారు మధ్యా హ్న సమయంలో వీలైనంత తక్కువగా ప్రయాణించేలా చూసుకోవాలంటున్నారు. ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా వెంట ఒక మంచి నీళ్ల సీసా పెట్టుకోవాలని వారు సూచిస్తున్నారు.
వేసవితాపం తాళలేక...
వేసవి తాపం నుంచి బయటపడేందుకు నగరవాసులు చల్లని పళ్లరసాలు, ఐస్‌క్రీమ్‌లు తింటూ గడుపుతున్నారు. పుచ్చకాయలు, చలవనిచ్చే పళ్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో చిరు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాల్లో పళ్లరసాలు, ఐస్‌క్రీమ్‌లు విక్రయించే చిన్నచిన్న వ్యాపారులకు గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. ఎండ వేడిమి తట్టుకునేందుకు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు.
వచ్చే వారం రోజులు సన్‌స్ట్రోక్ తప్పదు:
వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వేడిగాలుల తీవ్రత అధికమైంది. రాత్రి వేళల్లోనూ వేడిగాలులు వీస్తుండడంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంకో వారం రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికం అవుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే వారం రోజుల్లో ఎండల తీవ్రత ఇలా ఉండవచ్చని వారు పేర్కొన్నారు.
నీటి, విద్యుత్ సమస్యలపై దృష్టి సారించండి: ఎల్‌జీ
న్యూఢిల్లీ: వేసవికాలంలో ప్రజల ఇబ్బందులు కలగకుండా వివిధ ప్రభుత్వ సంస్థలను డిప్యూటీ కమిషనర్‌లు సమన్వయం చేయాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశించారు. నగరంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ప్రజలకు అవసరమైన తాగునీటి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని పౌర సమస్యలపై రోజువారీ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయన మున్సిపల్ డిప్యూటీ కమిషనర్‌లతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల తో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కిందిస్థాయి ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు ఎల్‌జీ కార్యాలయానికి పంపాలన్నారు. వీటిపై రాజ్ నివాస్‌లో సమావేశాలు ఉంటాయని తెలిపారు. అలాగే నగరవాసులకు ఇబ్బంది కలిగిస్తున్న ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించాలని డిప్యూటీ కమిషనర్‌లను ఆదేశించారు. ఈ సమావేశం తర్వాత జంగ్ ముందు ఢిల్లీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజంటేషన్ ఇచ్చింది.