రాష్ట్రమంతటా అత్యధిక స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
నల్లగొండ, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో 45 డిగ్రీలపైనే
సగటున 41.5 డిగ్రీల గరిష్ట
ఉష్ణోగ్రత.. సాధారణం కంటే 4.6 డిగ్రీలు అధికం
మరో రెండ్రోజులు పలు ప్రాంతాల్లో వడగాడ్పుల హెచ్చరికలు
సాక్షి, హైదరాబాద్: సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలో చాలాచోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం ఎక్కువగానే నమోదవుతున్నాయి.
ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. భద్రాచలంలో గరిష్టంగా 43.8 డిగ్రీల సెల్సియస్, మెదక్‌లో 24.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 41.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4.6 డిగ్రీల సెల్సియస్, భద్రాచలంలో 3.7 డిగ్రీల సెల్సియస్ అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మిగతా ప్రాంతాల్లో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదయ్యాయి.
అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న రెండురోజులు పలుచోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట్‌లకు ఈనెల 29 నుంచి మే 1వ తేదీ వరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలుప్రాంతాల్లో వడగాల్పులు తీవ్రస్థాయిలో ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రణాళికా శాఖ ప్రకారం 45 డిగ్రీలపైనే..
ప్రణాళికా శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని చాలాచోట్ల ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో 45.4, ములుగు జిల్లా మంగపేటలో 45.3, భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అశ్వాపురంలో 45.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment