'జీతాలు ఈరోజే చెల్లించండి'
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఢిల్లీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలకు విముక్తి లభించింది. వారి ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జతకట్టి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని విమర్శల దాడికి దిగిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వ ఆలోచనలో మార్పు వచ్చింది. గత రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించకుండా ఉన్న జీతభత్యాలను వెంటనే విడుదల చేయాలన్న వారి డిమాండ్ కు ప్రభుత్వం స్పందించి రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తామని ప్రకటించింది.
అయితే, ఆలోపే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శుక్రవారం రోజే వారికి మొత్తం రూ.493 కోట్లు విడుదల చేయాల్సిందిగా నగర మేయర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వెంటనే వారికి జీత భత్యాలు చెల్లించాలని కోరారు. ఈ నెల జూన్ 2 నుంచి పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగడంతో ఢిల్లీలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి.