పారిశుద్ధ్యంపై ‘సమ్మె’ పిడుగు
Published Thu, Jul 13 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM
– కాంట్రాక్ట్ కార్మికుల విధుల బహిష్కరణ
– పట్టణాల్లో తొలగని చెత్త
– కర్నూలులో ఇంటింటి చెత్త సేకరణకు బ్రేక్
కర్నూలు (టౌన్): జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులు చేపడుతున్న సమ్మె మొదటిరోజే ప్రభావం చూపింది. తమ డిమాండ్లు పరిస్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు కర్నూలు కార్పొరేషన్‌తో (570)పాటు నంద్యాల (200), ఆదోని (200) ,ఎమ్మిగనూరు (150), డోన్ (150), గూడూరు, నందికొట్కూరు (60), ఆళ్లగడ్డ, ఆత్మకూరు నగరపంచాయతీలలో పనిచేస్తున్న దాదాపు 1800 మంది మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. విధులను బహిష్కరించడంతో కర్నూలు నగరంతో పట్టణాల్లో చెత్త సమస్య తలెత్తింది. నగరంలో, 14 వార్డులు 1.50 లక్షల జనాభా ఉన్న కల్లూరు ఏరియాలో మెజారిటీగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచేసే కార్మికులు ఉన్నారు.
వీరంతా సమ్మెలో పాల్గొనడంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. కృష్ణానగర్, న్యూ కృష్ణానగర్, ఆదిత్యనగర్ కాలనీలలో ఇంటింటి చెత్తను సేకరించే కార్మికులు రాలేదు. దీంతో ఇంట్లో చెత్త బయటే పడేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాగే అనేక మున్సిపాల్టీలలోనే సమస్య ఇబ్బందిగా మారింది. 2014 సంవత్సరంలో ఏర్పడిన కొత్త మున్సిపాల్టీలు, నగరపంచాయతీల్లోను ఇదే పరిస్థితి. ఇక్కడ ఎక్కువగా కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే కార్మికులు ఉన్నారు. దీని వల్ల ఆయా మున్సిపాల్టీలో చెత్త సమస్య ప్రారంభమైంది. ప్రభుత్వం మరింత జాప్యం చేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని ఇప్పటికే యూనియన్ నాయకులు ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేసిన విషయం విదితమే. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకుంటే మున్సిపాల్టీలలో దుర్వాసనతో ప్రజలకు ఇబ్బందులు తప్పవు.
Advertisement