పుర‘పోరు’ ఉధృతం
మూడో రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె
నిలిచిన పారిశుద్ధ్య పనులు.. పట్టణాల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం
మంత్రి యనమల వ్యాఖ్యలపై మున్సిపల్ కార్మికుల మండిపాటు
ఆదివారం అర్ధరాత్రి నుంచి కరెంటు, నీరు సేవలు బంద్
సోమవారం నుంచి రాజకీయ పార్టీల మద్దతుతో ఉద్యమం
పుష్కర విధుల బహిష్కరణ హెచ్చరికలు
విజయవాడ బ్యూరో, హైదరాబాద్ : తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఉధృత రూపం దాల్చింది. పది ప్రధాన డిమాండ్లపై ఈ నెల పదోతేదీ అర్ధరాత్రి నుంచి చేపట్టిన సమ్మెతో పారిశుద్ధ్య సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో 36వేల మంది కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సమ్మె బాట పట్టారు. 25వేల మంది పర్మినెంట్ ఉద్యోగుల్లో 80 శాతం మంది సమ్మెలోకి దిగారు. కాంట్రాక్టు కార్మికులు ప్రభుత్వ మనుషులు కాదని, వారి డిమాండ్లు నెరవేర్చనవసరంలేదని మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలో మున్సిపల్ కార్మికులు భార్య, పిల్లలతో ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో చెత్తాచెదారాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ నూలేటి విజయలక్ష్మి, కౌన్సిలర్లు శుభ్రం చేశారు. ప్రకాశం జిల్లాలో పంచాయతీ కార్మికులతో పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు చేయించే ప్రయత్నాలు చేశారు. విశాఖలో కార్మికులకు అధికారులు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
పుష్కరాలపై సమ్మె ప్రభావం..
ఉభయగోదావరి జిల్లాల్లో పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె తీవ్ర ఇబ్బందికరంగా మారింది. కార్మికులు సమ్మె విరమించకపోతే పలు జిల్లాల్లోని పంచాయతీల పారిశుద్ధ్య కార్మికుల్ని పుష్కర పనులకు తరలించేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.ఒత్తిళ్లు పెంచుతోంది.
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించండి
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించి, వారి చేత సమ్మెను విరమింపజేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదివారం లేఖ రాశారు. ప్రభుత్వం మొండివైఖరి విడనాడి మున్సిపల్ కార్మికుల సమస్యలను మానవతా దృక్ఫథంతో చూడాలని విజ్ఞప్తి చేశారు.
నీరు, కరెంటు సేవలు బంద్...
సమ్మె చేపట్టి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో మంచినీరు, కరెంటు సేవలను కూడా బంద్ చేయాలని మున్సిపల్ ఉద్యోగుల, కార్మికుల జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి దశలవారీగా నీరు, కరెంటు సేవలను అందించే కార్మికులు, ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తున్నారని జేఏసీ నేత వి.ఉమామహేశ్వరరావు సాక్షికి చెప్పారు. సోమవారం నుంచి అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఈ నెల 14వ తేదీనుంచి జిల్లా కలెక్టరేట్‌లు, మున్సిపల్ కార్యాలయాల ఎదుట రిలే నిరాహార దీక్షలు నిర్వహించేందుకు కార్మిక సంఘాలు తీర్మానించాయి. 16న విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదుట ప్రదర్శన నిర్వహించేందుకు జేఏసీ నాయకులు తీర్మానించారు.