'మీ ధర్నాలో ఎన్నిగంటలయినా కూర్చుంటా'
న్యూఢిల్లీ: పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఢిల్లీలో పారిశుద్ధ్య కార్మికులతో కలసి ఆయన ఆందోళన చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు ఢిల్లీ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు మద్ధతు తెలిపిన రాహుల్ వారితో కలసి రోడ్డుపై బైఠాయించారు. గత మూడు నెలలుగా జీత భత్యాలు చెల్లించడం లేదంటూ చేస్తున్న ధర్నాలో ఆయన దాదాపు గంటపాటు వారితో కూర్చున్నారు.
అంతకుముందు ధర్నా వద్దకు వచ్చిన రాహుల్ తనకు మీ ఆందోళనలో పాలు పంచుకోవాలని ఉందని, ఎన్నిగంటలయినా మీతో కలిసి ధర్నాలో కూర్చోవాలని ఉందని చెప్పారు. అనంతరం ఢిల్లీ సర్కారు, కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ మండిపడ్డారు. యూపీఏ హయాంలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేశారని అన్నారు.