కేజ్రీవాల్ తో జంగ్ అమీతుమీ
న్యూఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో అమీతుమీ తేల్చుకునేందుకు లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సిద్దమయ్యారు. అధికారుల నియామకం, బదిలీల విషయంలో తనకున్న రాజ్యాంగపరమైన హక్కుల గురించి తెలుపుతూ బుధవారం కేజ్రీవాల్ కు ఆయన లేఖ రాశారు. తాను జారీచేసిన ఆదేశాలను పాటించొద్దని అధికారులకు చెప్పగలరా అంటూ ఆప్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. గత నాలుగు రోజులుగా కేజ్రీవాల్ సర్కారు చేసిన అధికారుల నియామకాలు, బదిలీలను లెప్టినెంట్ గవర్నర్ రద్దుచేశారు.
ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. మరోవైపు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని స్వతంత్రంగా పనిచేసుకోనివ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి అంతకుముందు కేజ్రీవాల్ లేఖ రాశారు.