ఆయనను డిస్మిస్ చేయాల్సిందే: స్వామి
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ను వెంటనే డిస్మిస్ చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి డిమాండ్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేజ్రీవాల్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు కాబట్టే మహేష్ గిరికి మద్దతుగా తాను వచ్చినట్లు చెప్పారు.
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లో ఎస్టేట్ అధికారిగా పనిచేసే ఎంఎం ఖాన్ మే 16న హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కాల్చిచంపారు. అయితే, ఈ హత్య వెనుక బీజేపీ ఎంపీ మహేష్ గిరి హస్తం ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆరోపణలను రుజువు చేయాలని, లేకపోతే వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ మహేష్ గిరి ఆదివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అవసరమైతే తనను ప్రశ్నించాలని, ఇంకా కావాలనుకుంటే అరెస్టు చేయాలని.. తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని ఢిల్లీ పోలీసు కమిషనర్ అలోక్ వర్మకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.