రాజుకున్న ఆధిపత్య వివాదం
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు, ప్రభుత్వానికి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సిఫారస్‌కు విరుద్ధంగా సీనియర్ బ్యూరోక్రాట్ శకుంతలా గామ్లిన్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని కేజ్రీవాల్ ఆరోపించారు. చీఫ్ సెక్రటరీ కేకే శర్మ వ్యక్తిగత పనిమీద సెలవులో అమెరికా వెళ్లడంతో వేరొకరికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. తన పేరు ప్రకటించాన కొద్ది గంటలలోనే పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయంలోని సీనియర్ అధికారి ఒత్తిడి చేస్తున్నట్లు ఆమె లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాశారు. గామ్లిన్ ప్రస్తుతం విద్యుత్ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఇది బిజినెస్ రూల్స్‌కు విరుద్ధం
ఎన్నికైన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని పరిగణనలోకి తీసుకోకుండా లెఫ్టినెంట్ గవర్నర్ బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆప్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలను నజీబ్ జంగ్ ఖండించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ఏఏ ప్రాకారం లెఫ్టినెంట్ గవర్నరే ఢిల్లీ సర్వోన్నత అధికారి అని పేర్కొన్నరు. ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించిన ఫైల్ మే 13 సాయంత్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి చేరింది. ఆయన వెంటనే దాన్ని క్లియర్ చేశారు. సీనియారిటీ, పనితీరు ప్రాతిపదికగా గామ్లిన్‌ను ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక చేసినట్లు గవర్నర్ తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన వ్యక్తి పేరు సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ పంపిన లిస్టులో లేదని, ఆ అధికారి ఇంతకు ముందెన్నడూ ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేయలేదని లెఫ్టినెంట్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికైన ప్రజా ప్రభుత్వాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నేరుగా ఆదేశాల జారీచేసే విశేష అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజ్యాంగం కల్పించలేదని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ పూర్తి రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం ఆరోపించింది.