నేడే ‘ఆమ్ ఆద్మీ’ ప్రమాణం | Today 'Aam Aadmi' standard | Sakshi
Sakshi News home page

నేడే ‘ఆమ్ ఆద్మీ’ ప్రమాణం

Published Sat, Feb 14 2015 5:50 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM

నేడే ‘ఆమ్ ఆద్మీ’ ప్రమాణం

నేడే ‘ఆమ్ ఆద్మీ’ ప్రమాణం

  • ఢిల్లీ 8వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేజ్రీవాల్
  • ఉప ముఖ్యమంత్రిగా సిసోడియా, మంత్రులుగా మరో ఐదుగురు!
  • రాంలీలా మైదానంలో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారోత్సవం
  • న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(46) ఢిల్లీ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రిగా నేడు(శనివారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. చారిత్రక రామ్‌లీలా మైదానంలో ఉదయం 11 గంటలకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కేజ్రీవాల్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన సన్నిహితుడు మనీశ్ సిసోడియా, మంత్రులుగా సత్యేంద్ర జైన్, జితేంద్ర తోమర్, గోపాల్ రాయ్, సందీప్ కుమార్, ఆసిమ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆప్ వర్గాలు తెలిపాయి. వీరిలో చివరి నలుగురు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారే. అలాగే, రామ్ నివాస్ గోయెల్‌ను స్పీకర్‌గా, వందన కుమారిని ఉపసభాపతిగా నియమించనున్నారని సమాచారం.

    2013 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్.. జనలోక్‌పాల్ బిల్లును బీజేపీ, కాంగ్రెస్‌లు అడ్డుకోవడానికి నిరసనగా సరిగ్గా సంవత్సరం క్రితం 2014, ఫిబ్రవరి 14న సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం.. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం తెలిసిందే. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తన ప్రమాణానికి రావాలని ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ ఇప్పటికే రేడియో ద్వారా ఆహ్వానించారు.

    ఈ నేపథ్యంలో పలువురు వీఐపీలతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావచ్చని భావిస్తున్నారు. దాంతో దాదాపు 1200 మందితో ఢిల్లీ పోలీసులు వేదిక వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణం తన ప్రభుత్వ ప్రాథమ్యాలను కేజ్రీవాల్ తన ప్రసంగంలో వివరించనున్నారు. ఆప్ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలుకు సంబంధించి రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాల్సిందిగా కేజ్రీవాల్ ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎం స్పోలియాను ఆదేశించారు.

    విద్యుత్ చార్జీల్లో 50% తగ్గింపు, ఢిల్లీ నగరమంతటా ఉచిత వైఫై సదుపాయం, 10-15 లక్షల సీసీ టీవీల ఏర్పాటు,  2 లక్షల పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, 20 కొత్త కాలేజీల ఏర్పాటు, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు క్రమబద్ధీకరణ, ఢిల్లీ ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా 30 వేల బెడ్స్, రానున్న ఐదేళ్లలో 8 లక్షల ఉద్యోగాల కల్పన.. మొదలైన హామీలను ఆప్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని కేజ్రీవాల్ ఆహ్వానించగా, ఇతర కార్యక్రమాలను ముందే ఒప్పుకున్నందువల్ల హాజరు కాలేనని మోదీ చెప్పిన విషయం తెలిసిందే.

    కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్(హోం), వెంకయ్యనాయుడు(పట్టణాభివృద్ధి), ఢిల్లీలోని 7గురు ఎంపీలను కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేజ్రీవాల్ ఆహ్వానించారు. కాగా, గత నాలుగు రోజులుగా జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న కేజ్రీవాల్ ఇంకా పూర్తిగా తేరుకోలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నీరసంతో కనీసం కూర్చోవడానికి కూడా కేజ్రీవాల్ ఇబ్బంది పడుతుండటంతో శుక్రవారం నాటి కొన్ని కార్యక్రమాలను పార్టీ రద్దు చేసింది. డయాబెటిస్ పేషెంట్ కూడా అయిన కేజ్రీవాల్ చలికాలంలో తరచూ గొంతు ఇన్ఫెక్షన్‌కు గురవుతుంటారు.
     
    కీలక శాఖలు తన వద్దే.. ఆప్ వర్గాల సమాచారం మేరకు.. కీలకమైన హోం, విద్యుత్, ఆర్థిక శాఖలను కేజ్రీవాల్ తనవద్దే అట్టిపెట్టుకోనున్నారు. తన సన్నిహితుడు, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మనీశ్ సిసోడియాకు విద్య, పట్టణాభివృద్ధి, ప్రజాపనుల శాఖలను అప్పగించనున్నారు. వీరిద్దరు నిర్వహించనున్న శాఖలకు కేంద్రం ప్రత్యక్ష సహకారం అవసరం. గత ఆప్ ప్రభుత్వంలో ఆరోగ్యం, పరిశ్రమల శాఖను నిర్వహించిన సత్యేంద్ర జైన్‌కు ఈ సారీ అవే శాఖలు అప్పగించనున్నారు.

    ఆప్ సీనియర్ నేత గోపాల్‌రాయ్‌కి రవాణా, కార్మిక శాఖల బాధ్యతలు అప్పగించనున్నారు. సందీప్ కుమార్‌కు మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ.. జితేంద్ర తోమర్‌కు న్యాయ శాఖ.. ఆసిమ్ అహ్మద్ ఖాన్‌కు ఆహార, పౌర సరఫరా, మైనారిటీ వ్యవహారాల శాఖ ఇవ్వనున్నారు. ఆప్ మీడియా కార్యదర్శి నాగేంద్ర శర్మను సీఎంకు మీడియా కార్యదర్శిగా నియమించనున్నారు.
     
    కేజ్రీవాల్‌ను సీఎంగా నియమించిన రాష్ట్రపతి

    ఆప్ అధినేత  కేజ్రీవాల్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమించారు. అలాగే మరో ఆరుగురిని మంత్రులుగా నియమించినట్లు పేర్కొంటూ కేంద్ర హోంశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎంగా ప్రమాణం చేసిన రోజు నుంచి కేజ్రీవాల్ సీఎంగా ఉంటారని అందులో తెలిపారు. సాధారణంగా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రులను గవర్నర్ ఆహ్వానిస్తారు. అయితే ఢిల్లీకి పాక్షిక రాష్ట్ర హోదా ఉన్నందున సీఎంను రాష్ట్రపతే నియమిస్తారు. మరోవైపు కేజ్రీవాల్ శనివారం సీఎంగా ప్రమాణం చేయగానే ఢిల్లీ రాష్ట్రపతి పాలన ముగియనుంది. ఈ మేరకు 2014 ఫిబ్రవరి 16న రాష్ట్రపతి పాలన విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్రపతి పేరుతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
     
    షీలా, అంబానీల కేసులను విచారిస్తాం

    కాంగ్రెస్ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ తదితరులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై తమ ప్రభుత్వం విచారణ జరుపుతుందని ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా చెప్పారు. వారిపై గతంలో 49 రోజుల పాటు ఆప్ అధికారంలో ఉన్న సమయంలో నమోదైన కేసులన్నింటిపై విచారణ జరుపుతామన్నారు. కేజీ బేసిన్‌లో ఉత్పత్తవుతున్న సహజవాయువు ధరను భారీగా పెంచే విషయంలో కుమ్మక్కయ్యారంటూ ముకేశ్, వీరప్ప మొయిలీలపై.. కామన్‌వెల్త్ క్రీడల సందర్భంగా వీధి దీపాల కొనుగోలు కుంభకోణంలో షీలా దీక్షిత్‌పై నాటి కేజ్రీవాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అలాగే, ఢిల్లీలోని విద్యుత్ సరఫరా కంపెనీల అకౌంట్లను కాగ్‌తో ఆడిట్ చేయిస్తామని సిసోడియా వెల్లడించారు. ప్రతీ ఇంటికీ నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందించే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ముఖ్యమంత్రి సహా తమ మంత్రులెవరూ ఎర్ర బుగ్గ కార్లను ఉపయోగించబోరన్నారు. బిహార్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement