రాష్ట్రపతి దగ్గరకు చేరిన పంచాయితీ
రాష్ట్రపతితో నజీబ్‌జంగ్, కేజ్రీవాల్ భేటీ
ఒకరిపై ఒకరు ఆరోపణలు; రాజ్‌నాథ్‌తోనూ జంగ్ మంతనాలు
అటార్నీ జనరల్ అభిప్రాయం కోరిన హోంశాఖ
న్యూఢిల్లీ: ఢిల్లీ ‘లొల్లి’ రాష్ట్రపతి దగ్గరకు చేరింది. ఢిల్లీ ప్రభుత్వాధినేతలు లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జీ) నజీబ్‌జంగ్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ల మధ్య ఐదు రోజులుగా సాగుతున్న ప్రత్యక్ష పోరు.. పరిష్కారం కోసం రాష్ట్రపతి కోర్టుకు చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం నజీబ్ జంగ్.. సాయంత్రం కేజ్రీవాల్ ఒకరి తరువాత ఒకరుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఎవరి వాదనలు వారు వినిపించారు. కేజ్రీవాల్ రాష్ట్రపతిని కలవటానికి కొద్ది గంటలు ముందుగా ఎల్‌జీ.. ప్రణబ్‌ను కలసి జరుగుతున్న ఘర్షణ నేపథ్యాన్ని వివరించారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ శకుంతలా గామ్లిన్‌ను నియమించటం, తదనంతర పరిణామాలను చర్చించారు. అంతకుముందు ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనూ 15 నిమిషాలు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని బేఖాతరు చేసి తాను తీసుకున్న నిర్ణయాలను జంగ్ సమర్థించుకున్నట్లు సమాచారం.
సాయంత్రం కేజ్రీవాల్.. ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో కలసి రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎల్‌జీ బేఖాతరు చేస్తున్నారని ప్రణబ్‌కు ఫిర్యాదు చేశామని సమావేశం తర్వాత సిసోడియా విలేకరులకు తెలిపారు. తనను సంప్రదించకుండానే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిని నియమించారని అన్నారు. కార్యదర్శుల నియామకాల్లోనూ ఎల్‌జీ జోక్యం మితిమీరిందని ఆయన ఆరోపించారు. ఎల్‌జీ తీసుకున్న ఏ నిర్ణయం కూడా రాజ్యాంగబద్ధం కాదని రాష్ట్రపతికి తెలిపినట్లు చెప్పారు. తన ఆదేశాలు వినకుంటే బదిలీ చేస్తానంటూ ఎల్‌జీ బెదిరిస్తున్నారని సీఎం కేజ్రీవాల్ తెలిపారన్నారు. రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో వ్యవహరించినట్లుగా ఎల్‌జీ వ్యవహరిస్తున్నారన్నారు.
ఆప్ ఎజెండాలో పరిపాలన లేదు: జైట్లీ
లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఆప్ సర్కారు ఘర్షణతో ఢిల్లీలో పరిపాలన స్తంభించిందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆప్ రాజకీయ ఎజెండాలో పరిపాలన అన్నది లేదని విమర్శించారు. కొత్త పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజలు ప్రయోగం చేశారని.. కానీ అది భారీ మూల్యానికి దారి తీస్తోందని అన్నారు.
గవర్నర్‌తో సంబంధం లేకుండానే నిర్ణయాలు
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్ నుంచి కానీ, ఆయన కార్యాలయం నుంచి కానీ మౌఖికంగా, రాత పూర్వకంగా ఎలాంటి ఆదేశాలు వచ్చినా, వాటిని వెంటనే అమలు చేయవద్దని ఆప్ సర్కారు ఉన్నతాధికారులందరికీ ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ వైపు నుంచి వచ్చే ప్రతీ ఆదేశాన్నీ, తప్పనిసరిగా ముఖ్యమంత్రికి కానీ, సంబంధిత శాఖ మంత్రికి కానీ తెలియజేశాకే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. జంగ్‌తో కేజ్రీవాల్ లడాయీ ఇంతటితో ఆగలేదు. సర్వీసుల ముఖ్య కార్యదర్శిగా తాను నియమించిన రాజేంద్రకుమార్ ద్వారా మరో ముఖ్యకార్యదర్శి నియామకపు ఉత్తర్వులను కేజ్రీవాల్ జారీ చేయించారు. సాధారణ పరిపాలనా విభాగపు ముఖ్యకార్యదర్శిగా అరవింద్ రేను నియమిస్తూ జీవో విడుదల చేశారు. అసలు రాజేంద్ర కుమార్ నియామకమే చెల్లదని ఎల్‌జీ వాదిస్తుంటే ఆయనతోనే మరో కార్యదర్శిని నియమింపజేయటం గమనార్హం.
నేడు రాష్ట్రపతితో రాజ్‌నాథ్ భేటీ!
ప్రతిష్టంభనను తొలగించటానికి బుధవారం రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్రపతితో భేటీ కానున్నట్లు సమాచారం. ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర హోం శాఖ పరిపాలనా నియంత్రణలో ఉండటంతో సమస్యకు పరిష్కారాన్ని చూపాల్సిన బాధ్యత హోంమంత్రిపైనే ఉంది. కాగా, ఎల్‌జీ-నగర ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు, విధులపై అభిప్రాయం చెప్పాలని అటార్నీ జనరల్‌ను హోం శాఖ కోరింది. అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వంలో తనకున్న అధికారాలపై న్యాయనిపుణులతో జంగ్ సంప్రదింపులు జరిపారు. గత శుక్రవారం శకుంతలా గామ్లిన్‌ను తాత్కాలిక ప్రధానకార్యదర్శిగా నియమించటంతో కేజ్రీవాల్‌కు, ఎల్‌జీకీ మధ్య ఘర్షణ నెలకొనడం తెలిసిందే.
బెంబేలెత్తుతున్న ఐఏఎస్‌లు
కేజ్రీవాల్, జంగ్‌ల ఘర్షణతో ఐఏఎస్‌లు బెంబేలెత్తుతున్నారు. దాదాపు 20 మంది కేంద్రపాలిత ప్రాంత కేడర్ ఐఏఎస్ అధికారులు తమను ఢిల్లీ నుంచి మరెక్కడికైనా బదిలీ చేయాల్సిందిగా కేంద్ర హోం శాఖను సంప్రదించినట్లు సమాచారం. అధికారికంగా ఎవరూ వెల్లడించకపోయినప్పటికీ, తాత్కాలిక ప్రధానకార్యదర్శిగా గామ్లిన్‌ను నియమించినప్పటి నుంచీ ఐఏఎస్‌లు ఇద్దరు రాజ్యాంగాధిపతుల మధ్య నలిగిపోతున్నారు. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులతో ఆప్ ప్రభుత్వం బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
ఆప్ సర్కారుకు లాయర్ల సమర్థన
ఎల్‌జీ నజీబ్ జంగ్, సీఎం కేజ్రీవాల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణపై సుప్రీం కోర్టు సీనియర్ లాయర్లు స్పందించారు. ప్రముఖ న్యాయవాదులు రాజీవ్ ధావన్, ఇందిరా జైసింగ్‌లు ఈ విషయంపై మాట్లాడుతూ ఉన్నతాధికారుల నియామకాలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్‌కు స్వతంత్ర అధికారాలు లేవని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరుండాలో ఎంచుకునే సంపూర్ణ హక్కులు ముఖ్యమంత్రికి ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ వివాదాన్ని లెఫ్టినెంట్ గవర్నరే సృష్టించారని ఆయన విమర్శించారు. ప్రధాన కార్యదర్శి సెలవుపై వెళ్లి 40 గంటలైనా తాత్కాలిక ప్రధానకార్యదర్శిని నియమించలేదన్న కారణంతో లెఫ్టినెంట్ గవర్నర్ తానే నియామకానికి పూనుకోవటం సరి కాదని అన్నారు.